Hospitals Ban Food in Wards: ఆస్పత్రి వార్డుల్లో భోజనాలు బంద్
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:10 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడంతోపాటు ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
రోగుల సహాయకులు వార్డులో ఆహారం తినడంపై నిషేధం
నిర్దేశిత క్యాంటీన్లలోనే ఆహారం తినడానికి అనుమతి
పరిశుభ్రత, వార్డుల్లో ఎలుకలు, కీటకాల నివారణ కోసమే
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు
ప్రజలు సహకరించాలి: డీఎంఈ నరేంద్ర కుమార్
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపర్చడంతోపాటు ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల వెంట ఆస్పత్రుల్లో ఉండే సహాయకులు(అటెండర్లు).. రోగులకు చికిత్స అందించే వార్డుల్లో ఆహారం తినడంపై పూర్తి నిషేధం విధించింది. నిర్దేశిత క్యాంటీన్లలో మాత్రమే అటెండర్లు భోజనాలు చేసేందుకు అనుమతిస్తామని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆదివారం ప్రకటించింది. ఇటీవల ఓ ఆస్పత్రిలో ఎలుకల సమస్య తలెత్తడంపై వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు స్పందించింది. ఆస్పత్రి సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రోగుల సహాయకులు వార్డుల్లో ఆహారం తినడం, మిగిలిన పదార్థాలను ఆవరణలో నిర్లక్ష్యంగా పారవేయడం వల్లే ఎలుకల బెడద పెరుగుతోందని సర్కారు భావిస్తోంది. అందుకే వార్డుల్లో ఆహార వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ‘హీలింగ్ జోన్’లుగా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందంటూ తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆస్పత్రుల్లో చెదల నియంత్రణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఐఎ్‌ఫహెచ్‌ఎంఎ్‌స) విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రులను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ఐహెచ్‌ఎ్‌ఫఎంఎ్‌సలో పలు మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఎలుకల చొరబడకుండా ఉండేందుకు ఆస్పత్రి భవనాల్లోని పగుళ్లు, రంధ్రాలను సిమెంట్, ఇతర దృఢమైన పదార్థాలతో శాశ్వతంగా మూసివేస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, లేబర్ రూమ్‌ల్లో ‘‘జీరో-గ్యాప్’’ సీలింగ్ విధానాన్ని పాటిస్తూ పూర్తి స్టెరిలైజేషన్ నిర్వహిస్తున్నామన్నారు. కిటికీలు, వెంటిలేటర్లు, డ్రైనేజీ పైపులు, డక్ట్‌లకు బలమైన వైర్ మెష్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై కఠిన నిషేధం విధిస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆస్పత్రుల్లో చెత్త తరలింపు పనుల పర్యవేక్షణకు సూపర్ వైజర్లను నియమిస్తున్నామని డీఎంఈ చెప్పారు. ఐఎ్‌ఫహెచ్‌ఎంఎ్‌స పరిధిలోని లైసెన్స్ పొందిన ఏజెన్సీల ద్వారా చేపడుతున్న ఎలుకల బోనుల ఏర్పాటు, బేటింగ్ ప్రక్రియలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నరేంద్ర కుమార్ వెల్లడించారు. చెదల నియంత్రణకు సంబంధించి ప్రతి ఆస్పత్రిలో ‘హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ’ పర్యవేక్షణలో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచడమనేది ఆస్పత్రి సిబ్బంది, అధికారులతోపాటు ప్రజల సామాజిక బాధ్యతని డీఎంఈ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.