Share News

kumaram bheem asifabad-రైతుభరోసాపై ఆశలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:10 PM

యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అతివృష్టి దెబ్బకు వానాకాలం పంటను కోల్పోయి కన్నీటి పర్యం తమైన అన్నదాతలు ఇపుప్పడు కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమయ్యారు.

kumaram bheem asifabad-రైతుభరోసాపై ఆశలు
లోగో

- యాసంగి సాగు మొదలు

బెజ్జూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అతివృష్టి దెబ్బకు వానాకాలం పంటను కోల్పోయి కన్నీటి పర్యం తమైన అన్నదాతలు ఇపుప్పడు కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నారుమళ్లు పోసి దుక్కులు దున్ని నాట్లకు ఉపక్రమించారు. కానా పెట్టుబడి(రైతు భరోసా) కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తు న్నారు. జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నా ప్రభుత్వం నుంచి అందాల్సిన పెట్టుబడి సాయం మాత్రం ఇంకా అందలేదు. విత్తనాలు, ఎరువులు, దుక్కి చేసేందుకు, కూలీల ఖర్చు కోసం ఈ సాయం ఎంతో ఆసరాగా ఉంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాను సంక్రాంతికి అందించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలవ్వగా వచ్చే నెలలో సాగు ముమ్మరం కానుండడంతో రైతులకు సరైన సమయంలో సాగు ఖర్చులకు ఉపయోగపడేలా ఉండేందుకు సంక్రాంతి కానుకగా అందించేంచేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- జిల్లా వ్యాప్తంగా..

ఈ యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 3.36లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 1,లక్షా 43వేలకు పైగా రైతులు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా అన్ని మండలాల్లో విత్తనాలు, ఎరువులు సరిపడా నిల్వలు ఉంచామని అధికారులు చెబుతున్నారు. కాగా గత వానాకాలం సీజన్‌లో రైతుల కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6వేల చొప్పున అందించింది. గత యాసంగి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం సీజన్‌కు ఎకరాకు ఏడున్నర వేలు ఇవ్వాల్సి ఉండగా నిధులు లేమితో పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.6వేలు మాత్రమే అందిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో ఎకరాకు రూ.5వే ల చొప్పున అందించింది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో రూ.15వేలు ఇస్తామని హామీ ఇవ్వగా కేవలం రెండు సీజన్లకు రూ.12వేలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే యాసంగి సీజన్‌ ప్రారంభమైనా ఇప్పటికి భరోసాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

- పెరుగుతున్న పెట్టుబడులు..

ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడుల ఆశతో హైబ్రీడ్‌ విత్తనాల కోసం రైతులు భారీగా ఖర్చు చేస్తున్నారు. దుక్కులు దున్నడం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు, నాట్లు ఇలా అన్ని కలిపి ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రైవేటు వ్యాపారులు ఆశ్రయించకుండా ప్రభుత్వ సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పినా నిధులు సర్దుబాటు కారణంగా దానిని రూ.12వేలకే పరిమితం చేసింది. వానాకాలంలో దశలవారీగా అందరికి సాయం అందించినా, ప్రస్తుత యాసంగిలో మాత్రం ఇంకా నిధుల జాడలేదు. వానాకాలం నష్టాల నుంచి కోలుకోవాలంటే రైతు భరోసా ఇస్తేనే కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

- సాగులో ఉన్న భూములకేనా..

రైతు భరోసాపై ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, సాగులో లేని భూమి రైతులు కూడా రైతు భరోసా పొందుతున్నారని, దీంతో కేవలం సాగు చేసే భూములకు, సాగుకు అవసరమైన యోగ్యత ఉన్న భూములకు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూముల జాభితాలో లేని కొండలు, గుట్టలు, బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు ఉండటంతో అట్టి భూములకు రైతుభరోసా నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై గతంలో వ్యవసాయరంగ నిపుణుల నుంచి అభిప్రా యాలు కూడా సేకరించింది. దీంతో మొత్తానికి సాగులో ఉండి పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోం ది. ఈ నెల 29నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతుభరోసాపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రైతు భరోసా పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు పండిస్తున్న వారికే భరోసా కల్పిస్తా మని మంత్రి చెప్పడంతో రైతు భరోసా మరింత ఆలస్య మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Dec 27 , 2025 | 10:10 PM