HPV Test for Cervical Cancer: రుతుస్రావ రక్తంతో హెచ్‌పీవీ పరీక్ష
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:21 AM
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రావడానికి ముఖ్యకారణం.. హ్యూమన్ పాపిలోమా వైరస్. దాని బారిన పడిందీ లేనిదీ తెలుసుకోవడానికి...
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించే వీలు
కిమ్స్ ఆస్పత్రి ‘పింక్ పిక్నిక్’లో ‘ఎం-స్ట్రిప్’ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రావడానికి ముఖ్యకారణం.. హ్యూమన్ పాపిలోమా వైరస్. దాని బారిన పడిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఇకపై మహిళలు ఆస్పత్రులకో, డయాగ్నస్టిక్ సెంటర్లకో వెళ్లక్కర్లేదు! ఇంట్లోనే.. నెలసరి రక్తంతో స్వీయ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించచి పరీక్ష చేయించుకోవచ్చు! గుజరాత్‌కు చెందిన ఐయోటా అనే కంపెనీ అభివృద్ధి చేసిన ‘ఎం-స్ట్రి్‌ప’తో ఇది సాధ్యమవుతుంది. గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలోని ఆంకాలజీ విభాగం.. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లో ‘పింక్ పిక్నిక్’ పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్ట్రిప్‌ను ఆవిష్కరించారు. రుతుస్రావం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌పై వచ్చే రక్తం మీద ఈ స్ట్రిప్ పెడితే చాలు. అది ఆ రక్తనమూనాలను సేకరిస్తుందని.. దాన్ని అయోటా కంపెనీకి సంబంధించిన సిబ్బందికి అందజేస్తే, వారు ల్యాబ్‌లో పరీక్షించి హెచ్‌పీవీ బారిన పడిందీ లేనిదీ నిర్ధారిస్తారని.. ఆంకాలజిస్ట్ డాక్టర్ భవ్య వివరించారు. అలాగే.. ఈ పింక్ పిక్నిక్ కార్యక్రమంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. రొమ్ములను పరీక్షంచుకోవడంపై అవగాహన కల్పించేందుకు ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయగా.. కస్టమైజ్డ్ బ్రాసరీలను తయారు చేసే బెంగళూరు కంపెనీ ‘బ్యాండ్స్ అండ్ కప్స్’ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే గతంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడి, శస్త్రచికిత్స, ఇతర చికిత్సలు చేయించుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్న పలువురు మహిళలు తమ విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ భాస్కర్‌రావు, యూనిట్ రీజనల్ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, మెడికల్ డైరెక్టర్ అంకిత చావ్లా, వైద్యులు పవన్ జొన్నాడ, మేకల లక్ష్మారెడ్డి, వి.ప్రజ్యోత్‌రెడ్డి పాల్గొన్నారు