HMDA: 7 ప్లాట్ల వేలం.. 3862.8 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:00 AM
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్‌ఎండీ)కు ప్లాట్ల వేలంతో తాజాగా రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలోని భూములను నాలుగు విడతల్లో....
నాలుగు విడతల్లో హెచ్‌ఎండీఏ వేలం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్లాట్ల వేలంతో తాజాగా రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలోని భూములను నాలుగు విడతల్లో విక్రయించడంతో ఈమేరకు రాబడి వచ్చింది. కోకాపేట నియోపోలీసు లే అవుట్‌లోని 27 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను మూడు విడతల్లో విక్రయించారు. నాలుగో విడతలో భాగంగా కోకాపేట గోల్డెన్ మైల్ లే అవుట్‌లోని 1.98 ఎకరాల స్థలాన్ని శుక్రవారం ఈ-వేలం వేశారు. ఈ స్థలానికి ఎకరం కనీస ధరను రూ.75 కోట్లుగా నిర్ణయించగా.. ఎకరాకు రూ.77.75 కోట్ల చొప్పున 1.98 ఎకరాలను రూ.153.94 కోట్లకు సీవోఈఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకుంది. మొత్తంగా నాలుగు విడతల్లో ఏడు ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న సంస్థలు వారం రోజుల్లో 25 శాతం చెల్లించాల్సి ఉండగా.. ఈఎండీ (దరావతు)తో కలిపిన 75 శాతాన్ని 60 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌ఎండీఏ అంచనాలకు మించిన ఆదాయం సమకూరడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కూకట్‌పల్లి మూసాపేటలో 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం విక్రయించాల్సి ఉండగా.. పార్కులు, ఇతర ఆట స్థలాల కోసమంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ స్థలాన్ని హెచ్‌ఎండీఏ వేలం వేయలేదు. ఈ స్థలాన్ని ప్రజావసరాల కోసం వినియోగించనున్నారు.