HMDA: హెచ్‌ఎండీఏలో రెండు రీజియన్లు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:09 AM
పాలనా సౌలభ్యం కోసం హెచ్‌ఎండీఏను రెండు రీజియన్లుగా విభజించారు. ఒకటి.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ కాగా..
ఔటర్ సరిహద్దుగా కోర్ అర్బన్, సబర్బన్‌గా విభజన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పాలనా సౌలభ్యం కోసం హెచ్‌ఎండీఏను రెండు రీజియన్లుగా విభజించారు. ఒకటి.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ కాగా.. మరొకటి ఓఆర్‌ఆర్ నుంచి హెచ్‌ఎండీఏ పరిధి వరకూ ఉండే సబర్బన్ రీజియన్. హెచ్‌ఎండీఏలో మెరుగైన పట్టణాభివృద్ధికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. ఈ రీజియన్లకు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్లను సైతం నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఆర్.ఉపేందర్‌రెడ్డికి హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (సబర్బన్ రీజియన్)గా, టి.వెంకన్నకు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్)గా పోస్టింగులు ఇచ్చింది. వీరంతా హెచ్‌ఎండీఏ కమిషనర్ పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించనున్నారు. వీరి విధులపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి. అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవల హెచ్‌ఎండీఏ పరిధిని 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.72 చదరపు కిలోమీటర్లకు పెంచిన విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అవతలి ప్రాంతాలు కూడా ఇందులో కలిశాయి. ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతమంతా సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండగా.. ఓఆర్‌ఆర్ నుంచి హెచ్‌ఎండీఏ పరిధి వరకు గల ప్రాంతం సుమారు 8 వేల చదరపు కిలోమీటర్లు.