Minister Sridhar Babu: హిల్ట్‌లో సొంత భూములకే వెసులుబాటు లీజు భూములకు అది వర్తించదు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:24 AM
హిల్ట్ పాలసీలో భూ వినియోగ మార్పిడి రుసుము అనేది సొంత భూములు ఉన్న పరిశ్రమలకే వర్తిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు...
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హిల్ట్ పాలసీలో భూ వినియోగ మార్పిడి రుసుము అనేది సొంత భూములు ఉన్న పరిశ్రమలకే వర్తిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని ఉంటే.. హిల్ట్ పాలసీ వర్తించబోదని తెలిపారు. ఈ విషయం తెలిసీ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న మూడు ప్రధాన పారిశ్రామిక పార్కుల్లో లీజులో ఉన్న ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించిందని, బీజేపీ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. సిరీస్ అనే ఫార్మా కంపెనీకి వంద ఎకరాల భూమిని దారాధత్తం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా.. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం బారిన పడకూడదన్న ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. దీనికి నాచారం ఇండస్ర్టీయల్ అసోసియేషన్ మద్దతు తెలిపిందన్నారు. హిల్ట్ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన తర్వాత అభ్యంతరాలుంటే.. తెలియజేయాలని సూచించారు. ఈ పాలసీపై రాహుల్‌కే కాదు.. ఇంకెవరికైనా కేటీఆర్ లేఖలు రాసుకోవచ్చన్నారు. కోడ్ అమలు లేని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తప్పేంటని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘కోవాసెంట్’తో 500 మందికి ఉపాధి
ప్రపంచంలోని అత్యుత్తమ వర్సిటీల సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 500 మంది ఇంజనీర్లతో ప్రారంభమైన కోవాసెంట్ ఇన్నేవేషన్ సెంటర్... 2028 నాటికి 3,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు.18మంది ఉద్యోగులతో ప్రారంభమైన సిగ్నిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ.. కోవాసెంట్‌గా పేరు మార్చుకుని వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ప్రొడక్షన్ సెంటర్ గా చైనాలోని షెంజెన్, క్రమశిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్ గురించి చెప్తారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతోందని తెలిపారు. కోవాసెంట్ చైర్మన్ సుబ్రమణ్యం, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, యూకే డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ వయన్ ఓవేన్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.