Share News

Congress BRS BJP Eye Victory: ఎవరి ధీమా వారిదే

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:50 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో గత కొద్దిరోజులుగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల యంత్రాంగాలు మొత్తం ఈ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం చేశాయి. రాజకీయంగా, ఆర్థికంగా తమ శక్తియుక్తులన్నీ ఖర్చు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి.....

Congress BRS BJP Eye Victory: ఎవరి ధీమా వారిదే

  • జూబ్లీహిల్స్‌లో గెలుపు తమదంటే తమదంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

  • గట్టి పోటీ ఇస్తామంటున్న బీజేపీ

  • పార్టీ యంత్రాంగాన్నంతా నియోజకవర్గంలో మోహరించిన అధికార, ప్రతిపక్షాలు

  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌

  • వారం రోజులుగా ప్రచారంలోనే మంత్రులు

  • ముస్లింలు, బీసీ, ఎస్సీ, సెటిలర్లలో మెజార్టీ తమ వైపేనంటున్న కాంగ్రె్‌స నేతలు

  • భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా

  • సిటింగ్‌ సీటు మళ్లీ తమదేనన్న బీఆర్‌ఎస్‌

  • ఉధృతంగా కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచారం

  • ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయన్న ఆశాభావం

  • ఓటింగ్‌ శాతం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై భారం.. బండి సంజయ్‌ ప్రచారంతో ఉత్సాహం

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో గత కొద్దిరోజులుగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల యంత్రాంగాలు మొత్తం ఈ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం చేశాయి. రాజకీయంగా, ఆర్థికంగా తమ శక్తియుక్తులన్నీ ఖర్చు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడిక ఓటర్ల వంతు వచ్చింది. మంగళవారం జరగనున్న పోలింగ్‌లో ప్రధాన పార్టీలు, ఆ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని వారు తేల్చనున్నారు. అయితే ఇన్ని రోజులుగా నిర్వహించిన ప్రచారం.. ఓటర్ల స్పందనను బట్టి ఉప ఎన్నికలో తమ పార్టీ జెండానే ఎగరడం ఖాయమంటూ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలా గెలుస్తామన్న దానిపై అంచనాలూ వేసుకుంటున్నాయి. బీజేపీ సైతం గట్టి పోటీ ఇస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. కాగా, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక లిట్మస్‌ టెస్టుగా మారింది. కంటోన్మెంట్‌ మినహా హైదరాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. డివిజన్‌కు ఇద్దరు చొప్పున మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించడమే కాకుండా.. పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ వారంరోజులుగా నియోజకవర్గంలోనే మోహరించారు. అన్ని డివిజన్లనూ చుట్టేస్తూ స్వయగా రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొని ప్రచారం చేశారు. మంత్రులూ తమకు కేటాయించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.


కాంగ్రె్‌సకు సిటింగ్‌ సీటు కాకపోయినా..

వాస్తవానికి జూబ్లీహిల్స్‌ సీటు.. కాంగ్రెస్‌ పార్టీకి సిటింగ్‌ సీటు కాదు. వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం దక్కలేదు. కానీ, హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వైఖరి ఉందని చాటుకునేందుకు ఈ ఎన్నికను కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పని చేసింది. నియోజకవర్గంలోని మైనారిటీ ఓటర్లను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలాగే ఎంఐఎం మద్దతునూ కూడగట్టారు. గతంలో ఈ నియోజకవర్గంలోని ముస్లింలలో అత్యధికులు బీఆర్‌ఎ్‌సకు మద్దతుగా ఉండేవారని, కానీ.. లోక్‌సభ ఎన్నికల నాటికి వారిలో ఎక్కువ మంది కాంగ్రె్‌సకు మద్దతు పలికారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచినా.. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థికే మెజారిటీ వచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇక తమ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ బీసీ, విద్యాధికుడు కావడం, బీసీ సంఘాలు పూర్తి మద్దతు ఇవ్వడంతో బీసీల్లోని మెజారిటీ ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

భారీ మెజారిటీపై హస్తం పార్టీ అంచనా

క్రిస్టియన్‌ మైనారిటీలు, ఎస్సీ వర్గాలు కూడా కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెటిలర్లు సైతం కాంగ్రెస్‌ పార్టీకే మద్దతుగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి చేసుకోవచ్చనన్న ప్రచారాన్ని పార్టీ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లింది. సాధారణంగా తటస్థ ఓటర్లు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతుంటారని, గతంలో పాలేరు, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాగే మజ్లి్‌సతోపాటు సీసీఐ, సీపీఎం, టీజేఎస్‌ పార్టీల మద్దతూ తమకు కలిసివస్తుందని చెబుతున్నాయి. ఈసారి ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని పెట్టి.. ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓటింగ్‌ శాతం పెరిగితే తమ అభ్యర్థి మెజారిటీ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని, అన్ని సమీకరణలూ కుదిరితే భారీ మెజారిటీ కూడా రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


పట్టు నిలుపుకొనేందుకు బీఆర్‌ఎస్‌ పోరాటం..

సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాక హైదరాబాద్‌ జిల్లాలో పట్టు నిలుపుకొనేందుకు ఈ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాగంటి గోపీనాథ్‌ సతీమణినే అభ్యర్థిగా నిలిపి.. సెంటిమెంట్‌ అస్త్రాన్ని సంధించింది. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని మోహరించడంతోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో హరీశ్‌రావు తండ్రి చనిపోవడంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను రౌడీషీటర్‌గా ప్రచారం చేస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ నేతలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని కేటీఆర్‌, హరీశ్‌ ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారని, ఈ ఉప ఎన్నికలో వారు తిరిగి బీఆర్‌ఎ్‌సకే మద్దతుగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పట్ల బస్తీల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించడం ద్వారా వారు తమ నిరసన వ్యక్తం చేస్తారని చెబుతున్నారు. అయితే గోపీనాథ్‌ కుటుంబంలో చెలరేగిన వివాదాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారన్న ఆందోళన బీఆర్‌ఎస్‌ నేతల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ అభ్యర్థికి మద్దతుగా కేసీఆర్‌ ప్రచారం చేయకపోయినా.. ప్రకటన కూడా చేయకపోవడం, ఈ అంశాన్ని రేవంత్‌ లేవనెత్తడం బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

బలం పెంచుకునే దిశగా బీజేపీ!

ఉప ఎన్నికలో బీజేపీ తన బలం పెంచుకుని గట్టి పోటీ ఇస్తుందన్న ఆశాబావాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పార్టీ జాతీయ నాయకులను దించకుండా రాష్ట్ర నాయకుల ప్రచారంపైనే ఆధారపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులువిస్తృతంగా ప్రచారం చేశారు. కిషన్‌రెడ్డి.. ప్రచార భారం మొత్తం తనపైనే వేసుకుని నడిపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన మార్కు ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కదన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో పట్టుదల పెరిగిందని, ఎవరూ ఊహించని స్థాయిలో తమకు ఓటింగ్‌ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తారని అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 02:51 AM