Telangana Government: ఫీజుపై సిఫారసులకు కమిటీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:38 AM
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు, ఉన్నత విద్యను మరింతగా మెరుగుపరిచేందుకుగాను...
15 మందితో ఉన్నతస్థాయి కమిటీ నియామకం
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు, ఉన్నత విద్యను మరింతగా మెరుగుపరిచేందుకుగాను ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి విధి విధానాలు, ట్రస్టు బ్యాంకు ద్వారా నిర్వహణ, నిధుల సేకరణకు అవసరమైన సిఫారసులు చేయనుంది. సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో విద్యాశాఖ, ఎస్సీ అభివృద్ధి, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌తోపాటు ఫ్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాం, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. వీరితోపాటు కమిటీ చైర్మన్ నిర్ణయించే మరో వ్యక్తి కూడా సభ్యుడిగా ఉంటారు. మొత్తం 15 మందితో కూడిన ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ఇటీవల డిప్యూటీ సీఎం, ఫాతీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను మరింత మెరుగు పరచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ట్రస్ట్ బ్యాంక్ ప్రతిపాదనపైనే..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిధుల స్వయం సమృద్ధిగా మార్చి, ఒక ట్రస్టు బ్యాంకు ద్వారా నిర్వహించాలని ఫాతీ ప్రతినిధులు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడదని సూచించారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులు ఓసారి సమావేశమై చర్చించారు. తాజాగా ట్రస్ట్ బ్యాంక్ అంశంపై అవసరమైన సిఫారసులు చేయాలంటూ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పథకాన్ని హేతుబద్ధీకరించడం, నిరంతరం పారదర్శకంగా కొనసాగించడానికి తగిన నిర్మాణాత్మక సూచనలు చేయాలని తెలిపింది. ఉన్నత విద్యా వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి వీలైన సలహాలివ్వాలని ఆదేశించింది. కమిటీ వివిధ వర్గాలతో చర్చలు జరిపి, వారి నుంచి స్వీకరించిన సలహాలు, ప్రతిపాదనలను అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని సూచించింది.