Fee Reimbursement: సంస్కరణల సంఘం.. మాకేం సంబంధం?
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:27 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలపై వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలపై ఉన్నతస్థాయి కమిటీ
ఏర్పాటు చేస్తామని నెల క్రితం మంత్రుల ప్రకటన
సీఎస్ ఆదేశాలిచ్చినా జీవో విడుదలపై ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శుల నిర్లక్ష్యం
తమ పరిధిలోని అంశం కాదంటూ తప్పించుకునే యత్నం
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలపై వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించి నెలరోజులు దాటుతున్నా ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ ఎప్‌సెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారందరికీ ప్రస్తుతం ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఉన్నత వర్గాలు, ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులే పెద్దసంఖ్యలో ఉన్నారు. దీని వల్ల ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ.500 కోట్లకు పైగా భారం పడుతోంది. ఈ నేపథ్యంలో.. ర్యాంకు ఆధారంగా కాకుండా, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఫీజు రీయింబర్స్ చేసేలా మార్పులు చేస్తే ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఆదా అవుతుందని.. గతంలో ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే.. దీనిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. సంస్కరణల సంఘం పేరుతో కమిటీ ఏర్పాటుకు జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆర్థిక, విద్యాశాఖ కార్యదర్శులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు.. రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. అయినా ఈ అంశంపై స్పందించేందుకు ఆర్థిక, విద్యా శాఖల కార్యదర్శులు ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇది విద్యాశాఖకు చెందిన అంశం కాబట్టి జీవో విడుదల తమ పరిధిలోకి రాదని ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొంటున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు సంక్షేమ శాఖలకు సంబంధించిన అంశం కాబట్టి.. తమ పరిధిలోకి రాదని విద్యాశాఖ కార్యదర్శి అంటున్నారు. సీఎస్ సమక్షంలో దీనిపై మూడుసార్లు సమావేశం జరిగినా జీవో విడుదల అంశం ఓ కొలిక్కి రాలేదు. కాగా.. సంస్కరణ సంఘం కమిటీ ఏర్పాటైతే.. ఫీజు రియింబర్స్‌మెంట్‌తోపాటు ఉన్నత విద్యకు సంబంధించిన అనేక సమస్యలపై ఆ కమిటీ చేసే సిఫారసుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.