High Demand in Torrur: తొర్రూర్‌లో గజం రూ.67,500
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:34 AM
హైదరాబాద్ నగరంలో సొంతింటి కల సాకారం చేసుకునే వారి కోసం ఓపెన్ ప్లాట్లకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్
ఓపెన్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సంస్థకు రూ.105 కోట్ల ఆదాయం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో సొంతింటి కల సాకారం చేసుకునే వారి కోసం ఓపెన్ ప్లాట్లకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో అనూహ్య స్పందన లభించింది. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని తొర్రూర్‌లో గజం స్థలం రూ.65,700 పలికిందని కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 300-450 చదరపు గజాల నిడివితో ఉన్న 100 ప్లాట్లకు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ఫంక్షన్ హాలులో వేలం నిర్వహించినట్లు పేర్కొన్నారు. చదరపు గజానికి రూ.25 వేలుగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ధర నిర్ణయించింది. వీటిలో కార్నర్ ప్లాట్లకు డిమాండ్ లభించింది. దాదాపు 24 కార్నర్ ప్లాట్‌లలో ఒక్కొక్కదానికి గజం రూ.67,500 చొప్పున ధర పలికిందని గౌతమ్ వెల్లడించారు. మొత్తం 100 ప్లాట్‌లకు సగటున గజం రూ.33వేల చొప్పున ధర వచ్చిందన్నారు. వేలం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు రూ.105కోట్ల మేర ఆదాయం వచ్చిందని, వేలం ప్రక్రియలో 240 మంది బిడ్డర్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు.