Hyderabad High Court: అధికార దర్పం ప్రదర్శించొద్దు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:59 AM
హైడ్రా వ్యవహారశైలిపై శుక్రవారం హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెరువులు, కుంటలు, జలాశయాల సంరక్షణ, పునరుద్ధరణ పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.,...
పబ్లిక్ ఆర్డర్‌ను పట్టించుకోకుండా హైడ్రా అతి
శని, ఆదివారాల్లో కూల్చివేతలా? : హైకోర్టు
విచారణకు వర్చువల్‌గా హాజరైన కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైడ్రా వ్యవహారశైలిపై శుక్రవారం హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెరువులు, కుంటలు, జలాశయాల సంరక్షణ, పునరుద్ధరణ పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చట్టబద్ధమైన పాలనకు లోబడి పనిచేయాలని, పబ్లిక్ ఆర్డర్‌ను పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అధికార దర్పాన్ని అధికంగా ప్రదర్శించవద్దని, అలా చేయడం ద్వారా కోర్టు తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించే పరిస్థితి తీసుకురావద్దని సూచించింది. ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట వద్ద చేపట్టిన కూల్చివేతలపై దాఖలైన ఓ కోర్టు ధిక్కరణ సహా ఇతర పిటిషన్‌లపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. చెరువుల పునరుద్ధరణ పేరుతో కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తుండడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వ భూముల రక్షణ, చెరువుల పునరుద్ధరణ పేరుతో కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రతిరోజూ అనేక కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలవుతున్నాయి. ఆదేశాలు అమలు కాకపోతే ఏం చేయాలో కూడా మాకు తెలుసు’’ అని పేర్కొంది. ‘‘హైడ్రా ఏర్పాటు జీవోలో చెరువులను రక్షించాలని మాత్రమే ఉంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాల్టీలు, సీవరేజీ బోర్డు, రెవెన్యూ, రోడ్లు, అక్రమ నిర్మాణాలు ఇలా అన్ని శాఖల పనులు కూడా హైడ్రా చేసేస్తుందా? అని ప్రశ్నించింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ సమాధానం ఇస్తూ హైడ్రా చేస్తున్న మంచి పనులను ప్రజలు ప్రశంసిస్తున్నారని, చెరువుల పునరుద్ధరణ చర్యలను సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలిపారు. ఆక్రమణలపై హైడ్రాకు పెద్దయెత్తున ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ ‘‘ఏది చేసినా చట్టబద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టలేరు. మీరు మందస్తు నోటీసులు ఇస్తే ప్రజలు కోర్టుకు ఎందుకు వస్తున్నారు? తెలిసో తెలియకో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు కొని ఉండొచ్చు.. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎలా ఏకపక్షంగా కూల్చివేతలు చేపడతారు? 50 నుంచి 100 గజాల్లో కట్టుకున్న చిన్న నిర్మాణాలను నోటీసు ఇవ్వకుండా శని, ఆదివారాల్లో కూల్చి వేస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి.. అవే నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల కింద ప్రభుత్వాలు మళ్లీ రెగ్యులరైజ్ చేస్తాయి’’ అని వ్యాఖ్యానించింది. మరోసారి కోర్టు ఆదేశాలను అతిక్రమించరాదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.