High Court: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంక్షేమానికి కొత్త చట్టం రావాలి
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:33 AM
సాఫ్ట్‌వేర్ కంపెనీలు కనీస సర్వీసు బాండ్‌లపై సంతకాలు చేయించుకుని ఉద్యోగుల హక్కులను హరించడమే కాకుండా...
బాండ్ పేరుతో ఉద్యోగి హక్కులు హరిస్తారా?.. సొమ్ము తిరిగి చెల్లించాలంటూ ‘అక్రమ బేరాలు’ ఏమిటి?
కార్మిక చట్టాలు వర్తించవా
హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ కంపెనీలు కనీస సర్వీసు బాండ్‌లపై సంతకాలు చేయించుకుని ఉద్యోగుల హక్కులను హరించడమే కాకుండా, రాజీనామా చేస్తే నష్టపరిహారం చెల్లించాలని వేధించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కనీస సామాజిక భద్రత లేకుండాపోతోందని వ్యాఖ్యానించింది. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా చట్టం చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వరుసగా మూడు కనీస సర్వీసు కం ష్యూరిటీ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకుని, రాజీనామా చేస్తే రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆల్గోనాక్స్ టెక్నాలజీస్ అనే సంస్థ వేధిస్తోందని ఆరోపిస్తూ నల్లగండ్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పొత్నూరు రాజేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. బాండ్‌లను అడ్డంపెట్టుకుని కంపెనీ యాజమాన్యం ‘అక్రమంగా బేరం’ ఆడుతోందన్న పిటిషనర్ ఫిర్యాదును పరిష్కరించడంలో రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్మికశాఖ కమిషనర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్ దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజీనామా చేస్తే రూ.5 లక్షలు లిక్వేడెటెడ్ డ్యామేజెస్ చెల్లించాలన్న కఠినమైన నిబంధనపై సైతం కార్మికశాఖ అధికారులు పరిష్కారం చూపలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్ని రోజుల సర్వీసు తర్వాత రాజీనామా చేస్తే ఎంత చెల్లించాలనే లెక్క కూడా లేకుండా ఉద్యోగిని వేధించడాన్ని తప్పుబట్టింది. లిక్విడేటెడ్ డ్యామేజెస్ చెల్లించాలని కోరడం ‘అక్రమ బేరం’ కిందికి వస్తుందా? లేదా? పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కార్మికశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. కార్మిక చట్టాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్తించవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆధునిక పనివాతావరణం, అధిక జీతాలు, విదేశీ టూర్లు, ఫుడ్ కూపన్స్, క్యాబ్ సర్వీసులు వంటి సౌకర్యాలు పైకి కనిపిస్తున్నా వారి జీవితాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయని పేర్కొంది. దేశ ఆర్థిక ప్రగతిలో కీలకంగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంక్షేమానికి తగిన చట్టాలు తీసుకు రావాలని సూచించింది.
దానం చేసిన భూమిని తిరిగి కోరలేరు
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): దాదాపు 20 ఏళ్ల కింద రిలింక్విష్‌మెంట్(హక్కు వదులుకోవడం) డీడ్ ద్వారా పట్టాభూమిని ప్రభుత్వానికి దానం చేసి, మళ్లీ ఇప్పుడు తిరిగి కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని ఆరు ఎకరాల భూమిని 2005లో స్థానిక ఎమ్మెల్యే, గ్రామ పెద్దల విజ్ఞప్తితో అదే గ్రామానికి చెందిన అజినాతి రవికుమార్, రావూరి భిక్షమయ్య(దాతలు) మినీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం దానం చేశారు. 2013లో రెండు ఎకరాల్లో సర్కారు కేజీబీవీ బడిని నిర్మించింది. నిధులు లేక మిగిలిన నాలుగు ఎకరాల్లో స్పోర్ట్స్ స్టేడియం కట్టలేదు. తమ ఉద్దేశం ప్రకారం భూమిని వినియోగించలేదు కాబట్టి దాన్ని తిరిగి తమకే స్వాధీనం చేయాలని దాతలు తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు. తహసీల్దార్ తిరస్కరించడంతో హైకోర్టుకు వెళ్లారు. దాతల వాదనతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. నాలుగు ఎకరాల భూమిని వారికే ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. దీనిపై రెవెన్యూ అధికారులు అప్పీలు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. దానం చేసిన భూమి ప్రభుత్వం పేరున నమోదయిందని, దాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది.