Telangana High Court: బంగారం దొంగపై పి.డి.చట్టం సబబే
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:23 AM
నగల దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడడంతో పాటు, అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై...
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నగల దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడడంతో పాటు, అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ముందస్తు నిర్బంధ చట్టం (పీడీ యాక్ట్) కింద కేసు పెట్టడం సబబే అని హైకోర్టు పేర్కొంది. అతడిని ముందస్తుగా అరెస్టు చేయడం సరైనదేనని జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం తెలిపింది. పోలీసుల అదుపులో ఉన్న తన కుమారుడు నాజిమ్ అజీజ్ కొటాడియా(నిందితుడు)ను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ అతడి తండ్రి ఆజిజ్ హసన్ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడు పలు దుకాణాల్లో దోపిడీకి పాల్పడటంతో పాటు, మేడ్చల్‌లో ఓ దుకాణం యజమానిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి పంపినట్లు తెలిపారు. నిందితుడికి నేరాలు అలవాటుగా మారాయని, వాటిని నివారించడానికే గూండాగా పరిగణించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడి చర్యల వల్ల సమాజంలో శాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం సబబే అని పేర్కొంది.
కొల్లాపూర్ పోలీసుల థర్డ్ డిగ్రీపై విచారణకు ఆదేశం
ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిపై కొల్లాపూర్ పోలీసు స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నాగర్‌కర్నూల్ ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లి గ్రామానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఓ వివాదానికి సంబంధించి ఫిర్యాదు ఇవ్వడానికి ఆ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సై, కానిస్టేబుళ్లు తనపైనే దాడి చేశారంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు.. ఘటనపై విచారణ చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేయడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని స్పష్టంచేసింది. కాగా, ఓ వివాదానికి సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ లొంగిపోయిన నక్సలైట్ వాసం తులసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే చట్టప్రకారం సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలే తప్ప నేరుగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం చెల్లదంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది.