Share News

High Court to Issue Orders on Reservation Petition: పరిశీలించి ఉత్తర్వులిస్తాం

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:35 AM

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది....

High Court to Issue Orders on Reservation Petition: పరిశీలించి ఉత్తర్వులిస్తాం

  • రిజర్వేషన్లు తగ్గించారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం

  • వరంగల్‌ జిల్లా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికపై స్టే

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ లంచ్‌మోషన్‌ రూపంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ మాధవీదేవి గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సామల రవీందర్‌, ఇతరులు వాదనలు వినిపిస్తూ.. ‘బీసీలకు 23శాతం కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదు. కొన్ని జిల్లాల్లో 13 శాతమే రిజర్వు చేశారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారు. ఓ గ్రామంలో 2014లో ఎస్టీ మహిళ, 2019లో జనరల్‌ మహిళ, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వు చేశారు. వాస్తవానికి ఆ ఊరిలో బీసీల సంఖ్య ఎక్కువ. ప్రభుత్వ జీవో, షెడ్యూల్‌ నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘చట్టప్రకారం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్ల మేరకు పంచాయతీ స్థానాలు కేటాయించాం. ముందు ఎస్టీకి, తర్వాత ఎస్సీకి, అనంతరం బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే రిజర్వేషన్లు ఇచ్చాం’ అని నివేదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కేటాయించిన తర్వాతే 50శాతంలో మిగిలిన స్థానాలు బీసీలకు కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 23శాతం ఇవ్వాలని చట్టంలో లేదు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తొలుత ఈ పిటిషన్లు సీజే ధర్మాసనం ముందు ఉంచితే బాగుంటుందేమోనని అభిప్రాయపడ్డారు. జీవో మేరకే ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, ఈసీని నిందించకూడదని సూచించారు. కోర్టులో రిజర్వేషన్ల పిటిషన్‌ విచారణ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున సింగిల్‌ జడ్జిగా ఈ అంశంలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలన జరిపి.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. కేవలం ఆరుగురు మాత్రమే ఎస్టీలు ఉన్న ఆ పంచాయతీని ఎస్టీలకు రిజర్వు చేయడంపై పిటిషన్‌ దాఖలైంది. దీనిపై శుక్రవారం వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Updated Date - Nov 28 , 2025 | 04:35 AM