Share News

TS High Court: వారికి క్యాబినెట్‌ హోదా ఎలా ఇస్తారు?

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:04 AM

పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ హోదా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను కొట్టేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల....

TS High Court: వారికి క్యాబినెట్‌ హోదా ఎలా ఇస్తారు?

  • కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలకు ఇవ్వడంపై హైకోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పిల్‌

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ హోదా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను కొట్టేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు కే కేశవరావు, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, పీ సుదర్శన్‌రెడ్డి, కే ప్రేమ్‌సాగర్‌రావు, జీ చిన్నారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, హర్కార వేణుగోపాల్‌రావు, ఆదిత్యనాథ్‌ దాస్‌, ఏపీ జితేందర్‌రెడ్డి, మల్లురవి, కే శ్రీనివాసరాజు, ప్రసన్నకుమార్‌ సూర్యదేవర, కే పెంటారెడ్డి తదితరులకు క్యాబినెట్‌ హోదా ఇస్తూ ప్రభుత్వం ఆయా సందర్భాల్లో జీవోలు జారీచేసిందని పేర్కొన్నారు. కాగా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన ప్రస్తుత వ్యాజ్యానికి రెగ్యులర్‌ నంబర్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ రిజిస్ట్రీ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. సదరు అభ్యంతరాల నోట్‌తో ఈ పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది ఆర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వాదించారు. గత ప్రభుత్వంలో ఇలాగే కొంతమందికి క్యాబినెట్‌ హోదా ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని వారు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిటిషన్‌కు రెగ్యులర్‌ నంబరు ఇవ్వాలని పేర్కొంటూ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. గతంలో రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన పిల్‌తో ఈ పిటిషన్‌ను జత చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన తాజా పిల్‌ త్వరలో రెగ్యులర్‌ పిల్‌ నంబరుతో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది.

Updated Date - Dec 12 , 2025 | 04:04 AM