Share News

Telangana High Court: స్థానికంపై నేడు స్పష్టత!

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:35 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై బుధవారం స్పష్టత రానుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ను సవాలు చేస్తు హైకోర్టులో....

Telangana High Court: స్థానికంపై నేడు స్పష్టత!

  • బీసీ రిజర్వేషన్లపై విచారించనున్న హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై బుధవారం స్పష్టత రానుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ను సవాలు చేస్తు హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. జీవో ప్రకారం రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు, పంచాయతీరా జ్‌ చట్టానికి విరుద్ధమంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను అక్టోబరు 8న(బుధవారం) విచారిస్తారనని చెప్పి హైకోర్టు సెప్టెంబరు 27న విచారణను వాయిదా వేసింది. సత్వరమే తేల్చాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో విచారణ జరగకముందే సుప్రీంకు వెళ్లడంతో ఆ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. దాంతో బుధవారం హైకోర్టు ఏం తేలుస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయి ఏడాది దాటింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కుల సర్వే నిర్వహించడంతో పాటు రిజర్వేషన్ల పెంపునకు సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా పలు చర్యలు తీసుకుంది. జనాభా ప్రకారమే రిజర్వేషన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285(ఏ)లో పలు సవరణలు చేసింది. బిల్లులను కేంద్రానికి పంపినా కేంద్రం సమాధానం చెప్పలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో చట్ట సవరణ చేయడంతో పాటు రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవోను జారీ చేసింది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల వరకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వివరాలను అందించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. 9న గురువారం నోటిఫికేషన్‌ వెలువడుతోంది. నవంబర్‌లో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది. జీవో 9పై దాఖలైన పిటిషన్లను తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించేదైనా బుధవారం హైకోర్టు విచారణ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.


జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఇందిరా శోభన్‌ ఇంప్లీడ్‌

బీసీల జనాభా, వెనుకబాటుతనానికి సంబంధించి కచ్చితమైన ఎంపరికల్‌ డేటాను ఆధారంగానే చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లను కొట్టేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, కాంగ్రెస్‌ నేత ఇందిరా శోభన్‌ హైకోర్టును కోరారు. బీసీ రిజర్వేషన్ల కేసులో వారు వేర్వేరుగా ఇంప్లీడ్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. బీసీ బిల్లులకు అసెంబ్లీ, మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, జీవోను వ్యతిరేకించడంలో అర్థం లేదని అన్నారు. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బీసీ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ పిల్‌

జీవో 9ను సవాల్‌ చేస్తూ మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రామాంతపూర్‌కు చెందిన శ్రీలేఖ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతున్నాయని, ఇది సుప్రీంతీర్పుకు విరుద్ధమని ప్రస్తావించారు.

Updated Date - Oct 08 , 2025 | 04:35 AM