Telangana High Court: రెవెన్యూ శాఖను తొలగిస్తే తప్ప దేశం బాగుపడదు
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:22 AM
రాష్ట్రవ్యాప్తంగా చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) నిర్ణయించకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది...
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) నిర్ణయించకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది. ఏది ఎఫ్‌టీఎల్.. ఏది పట్టా భూమి అనే విషయంలో రెవెన్యూ, నీటిపారుదల అధికారులకు సమన్వయం, అవగాహన లేదని పేర్కొంది. రెవెన్యూ శాఖను తొలగిస్తే తప్ప ఈ దేశం బాగుపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల పరిధిలోని సర్వే నంబర్ 11, 12, 13, 29, 30, 31లోని తమ పట్టా భూమిని మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ బి.కృష్ణారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్ 29 పూర్తిగా చెరువు మధ్యలో ఉంది. చెరువు మధ్యలో పట్టాలు ఎలా ఇస్తారు? రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ణయించని కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.