Share News

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Dec 05 , 2025 | 03:10 AM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 234(ఓ) ప్రకారం.. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని..

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

  • జనాభా లేకున్నా కొన్ని చోట్ల రిజర్వేషన్ల కేటాయింపు.. పిటిషనర్లు పేర్కొన్న అంశాల్లోనూ వాస్తవాలున్నాయ్‌

  • నోటిఫికేషన్‌ వచ్చాక ఎన్నికలు ఆపలేం

  • ఎస్‌ఈసీ తీరు సరిగ్గా లేదు: హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 234(ఓ) ప్రకారం.. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ల వాదనల్లో విషయం ఉన్నా.. నోటిఫికేషన్‌కు ముందు లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవని వెల్లడించింది. కనీస జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా సర్పంచ్‌, వార్డు మెంబర్‌ పదవులకు రిజర్వేషన్లను కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎ్‌సఈసీ) తీరు సరిగా లేదని హైకోర్టు తప్పుబట్టింది. ఎన్నికలు పూర్తయ్యాక సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా మిగిలిపోతే ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పిటిషన్ల విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది. వరంగల్‌ జిల్లా మహమూద్‌పట్నం పంచాయతీలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నప్పటికీ.. సర్పంచ్‌ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు రిజర్వ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఇలాంటి మరో నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ శ్యామ్‌ కోషి, జస్టిస్‌ చలపతిరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిలిపివేయాలని తాము కోరడం లేదని.. రిజర్వేషన్ల ప్రక్రియను కొన్ని ప్రాంతాల్లో మార్చాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.


ఈసీ నిర్ణయంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఒక ఊరిలో రిజర్వేషన్‌ వచ్చిన వర్గానికి చెందిన వారు ఒక్కరే ఉన్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2011 నాటి జనాభా లెక్కలను ఈసీ పరిగణనలోకి తీసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లోనే రాష్ట్రం విడిపోయిందని, అయినా 14ఏళ్ల క్రితం జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించామని.. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు తప్ప వేరే లెక్కలు తీసుకోవడానికి ఆస్కారమే లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రిజర్వేషన్‌ వచ్చిన వర్గం జనాభా లేకపోతే.. ఎన్నికలు నిలిచిపోయిన చోట వెంటనే ఎన్నికలు పెట్టాలని తెలిపింది. ముందస్తుగానే రిజర్వేషన్లు సరిగా కేటాయించాల్సి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలో విషయం ఉన్నా.. ఇలా పిటిషన్లు అనుమతిస్తూ పోతే ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని తేల్చి చెప్పింది.

29 మంది కలెక్టర్లను ఎందుకు చేర్చారు..?

బీసీ రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించారంటూ దాఖలైన మరో పిటిషన్‌లో న్యాయవాది తీరును ధర్మాసనం తప్పుబట్టింది. 29 జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని.. వారందనీ ఉద్యోగం నుంచి తొలగించాలని మీ ఉద్దేశమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో కో వారెంటో(ప్రభుత్వ ఉద్యోగికి ఆ పదవిలో కొనసాగే అధికారం లేదని) పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. 29 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రతివాదులుగా చేర్చడం సరికాదని, పిటిషన్‌ కొట్టివేయాలన్న అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తితో ఏకీభవించిన ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Dec 05 , 2025 | 03:10 AM