Telangana High Court: 488 రోజుల తర్వాత అప్పీల్ చేస్తారా?
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:54 AM
భూసేకరణకు సంబంధించిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 488 రోజుల తర్వాత వేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇంత ఆలస్యంగా దాఖలు చేసిన అప్పీలును సమర్థించలేమని ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది....
ఇలాంటి వాటిని సమర్థించలేం
ఎన్నికల విధులు, ఇతర కారణాలుచూపే హక్కు కలెక్టర్‌కు లేదు: హైకోర్టు
మణికొండ జాగీర్ భూసేకరణ తీర్పుపైప్రభుత్వ అప్పీలును కొట్టేసిన న్యాయస్థానం
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): భూసేకరణకు సంబంధించిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 488 రోజుల తర్వాత వేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇంత ఆలస్యంగా దాఖలు చేసిన అప్పీలును సమర్థించలేమని ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్‌లో సిలికాన్ హైట్స్ నిర్మాణం కోసం 2001లో సేకరించిన 6.22 ఎకరాల భూమికి సంబంధించి కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. ఎన్నికల విధులు, ఇతర పనులను కారణంగా చూపే హక్కు కలెక్టర్‌కు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నా జాప్యం చేయడాన్ని స్వాగతించలేమని పేర్కొంది. మణికొండ జాగీర్‌లోని 6.22 ఎకరాల తమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ మల్లేశ్వరి సహా 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి 2023, నవంబరులో తీర్పు ఇచ్చారు. సేకరించిన భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడం కోసం పిటిషనర్లు మూడు వారాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని, వాటిపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడం అసాధ్యమైతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి స్వాధీన ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లో ముగించాలన్నారు. అంటే మొత్తం ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌషమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పలు కారణాలతో 488 రోజుల జాప్యం తర్వాత అప్పీల్ దాఖలు చేశామని, విచారణకు స్వీకరించాలని సర్కారు కోరగా.. ధర్మాసనం తిరస్కరించింది.