Share News

Telangana High Court: హిల్ట్‌ జీవోపై స్టేకు హైకోర్టు నో!

ABN , Publish Date - Dec 06 , 2025 | 06:05 AM

హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పు(హిల్ట్‌) పాలసీపై ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం పాలసీ మాత్రమే ప్రకటించామని, దానికి సంబంధించి ఎలాంటి పనులు చేయలేదని......

Telangana High Court: హిల్ట్‌ జీవోపై స్టేకు హైకోర్టు నో!

  • జీవో చట్ట విరుద్ధమన్న పిటిషనర్లు.. పాలసీ ప్రకటించింది ఇప్పుడే కదా.. ఏదో అయిందనుకోవడం ఊహే

  • కాలుష్యంపై ప్రజల బాధ కనిపించట్లేదా?

  • పిటిషనర్లను తప్పుపట్టిన ప్రభుత్వం

  • ఏకీభవించిన హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పు(హిల్ట్‌) పాలసీపై ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం పాలసీ మాత్రమే ప్రకటించామని, దానికి సంబంధించి ఎలాంటి పనులు చేయలేదని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. హిల్ట్‌ పాలసీపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను 29కి వాయిదా వేసింది. మాస్టర్‌ ప్లాన్‌, హెచ్‌ఎండీఏ చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 22న జారీచేసిన హిల్ట్‌ పాలసీ జీవో 27ను కొట్టేయాలని కోరుతూ, ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. పిటిషన్‌లపై శుక్రవారం జస్టిస్‌ శ్యాంకోసీ, జస్టిస్‌ చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పురుషోత్తంరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదిస్తూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూములను మల్టీజోన్‌ అంటే బడులు, ఆసుపత్రులు, నివాస సముదాయాల నిర్మాణాలకు ఉపయోగించుకునే విధంగా పాలసీ తీసుకొచ్చారని, ఇది హెచ్‌ఎండీఏ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలా మార్చడానికి అవసరమైన చట్టబద్ధ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌, జోనింగ్‌ నిబంధనలు మార్చాలని, నోటిఫికేషన్‌ ఇచ్చి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని అన్నారు. పరిశ్రమల భూములను మరే ఇతర అవసరాలకు వినియోగించుకోరాదని 2013లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. నగర పరిధిలో ఉన్న పరిశ్రమలు మొత్తం పూర్తిగా శివార్లలోకి తరలిపోయి సెటిల్‌ అయ్యే వరకు సదరు భూములను ముట్టుకోవడానికి వీల్లేదని అన్నారు. జీవోపై స్టే విధించకపోతే ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించే ప్రక్రియ చేపట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది వివేక్‌ రెడ్డి ఎర్రమంజిల్‌ కేసును ప్రస్తావించారు.


జోనింగ్‌ రెగ్యులేషన్స్‌కు విరుద్ధంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘ఎర్రమంజిల్‌ ’ భవనాన్ని కూల్చివేసి అక్కడ అసెంబ్లీ కట్టాలన్న ప్రతిపాదనకు హైకోర్టు అంగీకరించలేదని గుర్తు చేశారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించాలని చూస్తోందని కేఏపాల్‌ అన్నారు. పిటిషనర్ల తొందరపాటును అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు. కాలుష్య కారక పరిశ్రమలను శివార్లకు తలించడం ద్వారా హైదరాబాద్‌ను గ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేయాలన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించిందని చెప్పారు. బాలానగర్‌, కూకట్‌పల్లి, కాటేదాన్‌ కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలు అవుతున్నారని, దుర్వాసన, తాగునీటి కాలుష్యంపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రజల కన్నీళ్లు కనిపిచడం లేదా అని పిటిషనర్లను ప్రశ్నించారు. గ్రీన్‌ జోన్‌లో ఉండే హైదరాబాద్‌ ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చిందని, రోజురోజుకూ గాలి నాణ్యత తగ్గిపోతోందని తెలిపారు. ప్రభుత్వానికి వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వుల కోసం పట్టుబట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పాలసీ ప్రకటించిందే ఇప్పుడని, ఇంకా ఏ పని చేయలేదని, ఏదో అయిందని ఊహించుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. హిల్ట్‌ పాలసీ మాత్రమే ప్రకటించామని, హెచ్‌ఎండీఏ చట్టం ప్రకారం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, మాస్టర్‌ ప్లాన్‌ను సవరిస్తామని, దానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. నగరం మధ్యలో పరిశ్రమలు పెడతామంటే అభ్యంతరం ఉండాలి కానీ తరలిస్తామంటే అభ్యంతర వ్యక్తం చేయడం ఎక్కడి విచిత్రమని ప్రశ్నించారు. ఎర్రమంజిల్‌ వారసత్వ, చారిత్రక కట్టడమని, దానితో పరిశ్రమలను పోల్చడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 06 , 2025 | 06:05 AM