Share News

Telangana High Court: ఎన్నికల ప్రక్రియను ఆపలేం

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:20 AM

రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జీవో..

Telangana High Court:  ఎన్నికల ప్రక్రియను ఆపలేం

  • బీసీల్లో కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడంపై పిటిషన్‌

  • జీవో 46పై స్టేకు హైకోర్టు నిరాకరణ

  • రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికలసంఘానికి నోటీసులు జారీ

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జీవో 46పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోలేమని, సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను అడ్డుకోరాదని చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. దీంతో మొత్తం రిజరేషన్లు 50ు లోపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోకు అడ్డంకులు తొలగినట్లయింది. బీసీల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం చెల్లదని, బీసీలకు మొత్తంగా రిజర్వేషన్లు ఇస్తూ జారీచేసిన జీవోను కొట్టేయాలని, అలాగే మొత్తం రిజర్వేషన్లు 50ు దాటకూడదని నిర్దేశిస్తున్న పంచాయతీరాజ్‌ చట్టం-2018 సెక్షన్‌ 285ఏకు రాజ్యాంగ బద్ధత లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మదివాల మచదేవ రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. లక్ష్మయ్య తదితరులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది మలుగారి సుదర్శన్‌ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో సదరు డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్ట్‌ను ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. ఏ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారో తెలుసుకునే హక్కు బీసీ వర్గాలకు ఉందని తెలిపారు. బీసీలకు గంపగుత్తగా రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని, బీసీల్లో అత్యధికంగా ఉన్న కాపు, ముదిరాజ్‌, యాదవ, గౌడ తదితర కులాలకు మాత్రమే రిజర్వేషన్‌ ఫలితాలు దక్కుతాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు బీసీల్లో సబ్‌ కేటగిరీ రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఆరు వారాలు, దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్‌కు రెండు వారాల గడువు కేటాయిస్తూ విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను అందజేయాలన్న పిటిషనర్‌ న్యాయవాది విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్లు వేసే సందర్భంగా ప్రభుత్వం కమిషన్‌ రిపోర్ట్‌ను అందజేయకపోతే అప్పుడు కమిషన్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపింది.

Updated Date - Nov 29 , 2025 | 04:20 AM