Telangana High Court: సిగాచి మృతులకు రూ.కోటి ఇచ్చారా?
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:24 AM
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతిచెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం తరఫున ఇస్తామన్న..
ప్రమాద ఘటన బాధ్యులను అరెస్టు చేయలేదేం?.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
నిపుణుల నివేదికపై 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతిచెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం తరఫున ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఇచ్చారా? బాధితులకు ఇప్పటివరకు ఎంత పరిహారం అందజేశారు? ప్రస్తుతం పరిశ్రమ ఎవరి అధీనంలో ఉంది? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే నిపుణుల కమిటీ చేసిన సిఫారసులపై అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ప్రమాదానికి కారకులైన యాజమాన్య ప్రతినిధులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడంప్టై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతులకు న్యాయం చేయడంతోపాటు దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. ఘటన జరిగి 4 నెలలు పూర్తికావస్తున్నా దర్యాప్తు మందకొడిగా కొనసాగుతోందని తెలిపారు. పరిహారం సైతం పూర్తిగా అందలేదని, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసులు 192 మంది సాక్షులను విచారించారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25-40 లక్షల వరకు పరిహారం అందజేసినట్లు వివరించారు. గత వారమే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని.. అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రమాదంలో పరిశ్రమ ఉపాధ్యక్షుడు కూడా మృత్యువాత పడ్డారన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఏయే చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరారు. ఆలోగా ప్రభుత్వ నిర్ణయంతోపాటు నిపుణుల కమిటీ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ ఎవరి అధీనంలో ఉందని సీజే ప్రశ్నించగా.. రాష్ట్ర పరిశ్రమల శాఖ అధీనంలో ఉందని ఏఏజీ చెప్పారు. కంపెనీ ప్రాంగణాలను కార్మిక శాఖ సీజ్ చేసిందన్నారు. రూ.కోటి పరిహారంపై సిగాచి యాజమాన్యమే స్పందించాల్సి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిపుణుల కమిటీ నివేదికపై అఫిడవిట్ సమర్పించడానికి ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఆ అఫిడవిట్‌లో దర్యాప్తు పురోగతితో పాటు మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఇప్పటివరకు చెల్లించిన నష్టపరిహారం వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.