Share News

Telangana High Court: ప్రమాదంపై దర్యాప్తు జరపడం లేదెందుకు?

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:16 AM

సిగాచీ పరిశ్రమ పేలుడు దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదంటూ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.....

Telangana High Court: ప్రమాదంపై దర్యాప్తు జరపడం లేదెందుకు?

  • ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? 12 శాఖలు తనిఖీలు చేశాయా?

  • ‘సిగాచి’పై అధికారులను సూటిగా ప్రశ్నించిన ధర్మాసనం

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సిగాచీ పరిశ్రమ పేలుడు దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదంటూ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారులపై ప్రశ్నల బాణాలు సంధించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ రిటైర్డ్‌ సైంటిస్ట్‌ కలపల బాబూరావు దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, దర్యాప్తు అధికారుల తరఫున ఏఏజీ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ విచారణలో భాగంగా మొత్తం 283 మందిని ప్రశ్నించినట్లు, ప్రభుత్వం తరఫున రూ. 23 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ సిగాచీ రెడ్‌ కేటగిరీ పరిధిలో ఉన్న పరిశ్రమ కాబట్టి 12 శాఖల అధికారులు నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయాల్సి ఉందని, అది జరిగిందా అని ప్రశ్నించింది. దీనికి దర్యాప్తు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు సరిగ్గా సంసిద్ధమై రాలేదు. మీపై ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఉంటే మీకంటే ఉన్నతాధికారులతో దర్యాప్తునకు ఆదేశిస్తాం. లేదంటే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుంది. ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాల బలం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాంట్రాక్టు కార్మికుల గొంతు లేకుండా పోతోంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిగతా వారికి గుణపాఠం రాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్కో మృతుని కుటుంబానికి సిగాచీ యాజమాన్యం ఇస్తానన్న రూ.కోటి పరిహారం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని పరిశ్రమ తరఫు హాజరైన న్యాయవాది అశోక్‌రెడ్డి కోరారు. ఈ కేసులో కోర్టుకు సహాయం చేసేందుకు అమికస్‌క్యూరీ (కోర్టు సహాయకుడు)గా డొమినిక్‌ ఫెర్నాండెజ్‌ అనే న్యాయవాదిని నియమించింది. పూర్తి వివరాలతో మళ్లీ రావాలని ఆదేశిస్తూ విచారణను 30కి వాయిదా వేసింది.

Updated Date - Dec 10 , 2025 | 04:16 AM