Telangana High Court: వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలను పాటించాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:34 AM
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది...
రాష్ట్ర అధికారులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జంతు సంతతి నియంత్రణ (ఏబీసీ) విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో వీధి కుక్కలు లేకుండా అధికారులు పూర్తిగా నిర్మూలిస్తున్నారని.. అలా చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదని పేర్కొంటూ జంతు సంరక్షణ, సహాయ సంఘం(ఆస్రా) అధ్యక్షురాలు గౌరీ వందన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధి కుక్కల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసినందున వాటిని తు.చ. తప్పకుండా పాటించాలని స్పష్టంచేసింది. వీధి కుక్కల తరలింపుపై వివరాలు తెలియజేయడానికి చీఫ్ వెటర్నరీ అధికారి భౌతికంగా లేదా వర్చువల్‌గా హాజరుకావాలని పేర్కొంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.