High court: భూకేటాయింపులో అందరికీ సమన్యాయం
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:08 AM
ప్రభుత్వం కొందరికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించకుండా, అందరిని సమదృష్టితో చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.....
కేకే కుమార్తె, కుమారుడికి తక్కువ ధరకు ఎలా ఇస్తారు: హైకోర్టు
తప్పక ఇవ్వాలనుకుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొందరికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించకుండా, అందరిని సమదృష్టితో చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత కాంగ్రెస్ నేత కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావుకు బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్ (మురికివాడ)లోని సర్వే నెంబర్ 140లో రూ.2,500 చొప్పున కేటాయించిన 1,161 చదరపు గజాలు, కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి సర్వే నెంబర్ 403లో రూ.350 చొప్పున కేటాయించిన 425 చదరపు గజాల భూమిని రెగ్యులరైజ్ చేస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 56ను జారీచేసింది. మార్కెట్ రేటు ప్రకారం కాకుండా అతి తక్కువ ధరకు సదరు భూమిని రెగ్యులరైజ్ చేయడం చెల్లదని పేర్కొంటూ గడీల రఘువీర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది పిల్ వేశారు. బుధవారం దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలను పక్కనబెట్టి సదరు భూమిని రెగ్యులరైజ్ చేసిన జీవోను కొట్టేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. సదరు భూములపై ఇప్పటికీ కోర్టులో అనేక కేసులు నడుస్తున్నాయని, పూర్తి వివరాలు అందజేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రతివాదులకు భూమిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జీవో అందరికీ వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. అందరికీ సమన్యాయం ఉండాలని వ్యాఖ్యానించింది. కచ్చితంగా సదరు భూమిని వారికే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తున్నట్లయితే మార్కెట్ ధర ప్రకారం జీవోను సవరించాలని స్పష్టం చేసింది. పొరపాటును సరిదిద్దుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొంటూ విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది.