TS High Court: ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులు వేలం వేయండి
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:23 AM
అత్యధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబడులు స్వీకరించి మోసం చేసిన కేసులో ధన్వంతరి ఫౌండేషన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది....
ఆ సొమ్ము బాధితులకు చెల్లించండి: హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): అత్యధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబడులు స్వీకరించి మోసం చేసిన కేసులో ధన్వంతరి ఫౌండేషన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును బాధితులకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితులను గుర్తించి, సొమ్ము పంపిణీ చేయడం కోసం నలుగురు నిపుణులతో కమిటీ వేయాలని సూచించింది. అత్యధిక లాభాల ఆశ చూపి దాదాపు 4,000 మంది నుంచి ధన్వంతరి ఫౌండేషన్ పెట్టుబడులు ేసకరించింది. ప్రారంభంలో కొద్ది రోజుల పాటు చెల్లింపులు జరిపిన తర్వాత చేతులెత్తేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. క్రిమినల్ కోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 8 చోట్ల ఉన్న దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆస్తులు జప్తు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ధన్వంతరి ఫౌండేషన్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే సుజన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ధన్వంతరి ఫౌండేషన్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ట్రయల్ కోర్టు సహజ న్యాయ సూత్రాలను పట్టించుకోకుండా అటాచ్‌మెంట్ ఆదేశాలను జారీ చేసిందని, వాటిని కొట్టివేయాలని కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ధన్వంతరి ఫౌండేషన్ అక్రమంగా బాధితుల నుంచి రూ.762 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. రూ. 516 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు ఆ సంస్థ పేర్కొంటున్నప్పటికీ మిగతా మొత్తాన్ని ఆక్రమంగా మళ్లించిదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. మోసపోయిన బాధితులకు న్యాయం చేసే విధంగా ఆస్తులను వేలం వేసి, సొమ్ము చెల్లించాలని ఆదేశించింది.