Share News

Land Dispute: హైడ్రా కూల్చివేతలతో కొండాపూర్‌లో ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:37 AM

హైకోర్టు తీర్పుతోపాటు రెవెన్యూ శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్‌లోని 59వ సర్వే నంబర్‌లోని 36 ఎకరాల సర్కారు భూమిలో గల ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది...

Land Dispute: హైడ్రా కూల్చివేతలతో కొండాపూర్‌లో ఉద్రిక్తత

  • 59వ సర్వేనంబర్‌లోని 36 ఎకరాల భూమి సర్కారుదని హైకోర్టు తీర్పు

  • భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు

  • భూమి విలువ సుమారు రూ.3600 కోట్లని అంచనా

రాయదుర్గం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పుతోపాటు రెవెన్యూ శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్‌లోని 59వ సర్వే నంబర్‌లోని 36 ఎకరాల సర్కారు భూమిలో గల ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది. నోటీసులివ్వకుండా కూల్చివేయడంతో తాము రోడ్డున పడతామని బాధితులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు, సిబ్బంది.. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. 24 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమి విలువ రూ.3,600 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూశాఖ వాదిస్తే.. 12 మంది వ్యక్తులు తాము ఒక్కొక్కరూ ప్రభుత్వ వేలంలో 3 ఎకరాలు కొనుగోలు చేసి.. 30 ఏళ్లుగా వ్యవసాయం సాగు చేస్తున్నట్లు 1997లో రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జిల్లా న్యాయస్థానం.. ఆ భూమి కబ్జాలో ఉన్న వారిదేనని 2002లో ఇచ్చిన తీర్పును.. రెవెన్యూశాఖ 2003లో హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై సమగ్రంగా విచారించిన హైకోర్టు.. అది సర్కారు భూమి అని గత నెల 3వ తేదీన తీర్పునిచ్చిందని శేరిలింగంపల్లి తహశీల్దార్‌ వెంకారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు, రెవెన్యూ శాఖ విజ్ఞప్తి మేరకు శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారుల బృందాలు.. అనుమతి లేని నిర్మాణాలు, షెడ్లు, బోర్లు తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని బాధితులు వాపోయారు. తాము పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో నిర్మించుకున్నామని, ఉన్నపళంగా వచ్చి ఎలా కూల్చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతోపాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, రెవెన్యూశాఖ విజ్ఞప్తి మేరకు తమ సంస్థ పని చేసిందని హైడ్రా వెల్లడించింది.

30 లక్షల సామగ్రి పాడైంది

‘మేం నాలుగు షాపులతో నిర్మించిన షెడ్డును నెల క్రితమే అద్దెకు తీసుకున్నాం. రూ.30 లక్షలు అప్పు చేసి, వంట సామాన్లు, ఇతర సామగ్రి తెచ్చుకుని టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాం. తెల్లవారు జామునే వచ్చిన హైడ్రా అధికారులు.. మా సామాన్లు తీసుకునే అవకాశమూ ఇవ్వకుండా టిఫిన్‌ సెంటర్‌ షెడ్లను కూల్చేశారు. ఇంజనీరింగ్‌ చదివినా ఉద్యోగం లేక అప్పులు చేసి ఏర్పాటు చేసుకున్న టిఫిన్‌ సెంటర్‌ను కూల్చేశారు. సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

- టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకురాలు లక్ష్మి

Updated Date - Oct 05 , 2025 | 05:37 AM