High Court: తండ్రికి కాలేయ దానం చేసేందుకు భర్త అనుమతి ఎందుకు?: హైకోర్టు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:16 AM
తండ్రికి కాలేయం దానం చేయడానికి.. భర్త అనుమతి పొందాలంటూ మహిళను ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఒత్తిడి చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
తండ్రికి కాలేయం దానం చేయడానికి.. భర్త అనుమతి పొందాలంటూ మహిళను ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఒత్తిడి చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వైవాహిక వివాదం కారణంగా తాను భర్తకు దూరంగా ఉంటున్నానని, అయినా కాలేయం దానం చేయడానికి ఆయన నుంచి అనుమతి తెచ్చుకోవాలని వైద్యులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కే శరత్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవయవ మార్పిడి చట్టంలో ఎక్కడా నిబంధనలు లేకపోయినా దూరంగా ఉంటున్న భర్త అనుమతి పొందాలని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. భర్త అనుమతి తెచ్చుకోవాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని తెలిపింది. భర్త అనుమతి ఉండాలన్న నిబంధన చట్టంలో లేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం వైద్యం చేయాలని సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.