Share News

Nauhera Shaikh in Heera Group Case: నౌహీరా షేక్‌కు రూ.5 కోట్ల జరిమానా

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:58 AM

అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న హీరా గ్రూప్‌, ఆ కంపెనీ డైరెక్టర్‌ నౌహీరా షేక్‌కు హైకోర్టులో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది..

Nauhera Shaikh in Heera Group Case: నౌహీరా షేక్‌కు రూ.5 కోట్ల జరిమానా

  • ఆస్తుల వేలం జరగకుండా పదేపదే పిటిషన్లా?: హైకోర్టు

అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న హీరా గ్రూప్‌, ఆ కంపెనీ డైరెక్టర్‌ నౌహీరా షేక్‌కు హైకోర్టులో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హీరా గ్రూప్‌ ఆస్తులు వేలం వేసుకోవచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పదే పదే అదే అంశంపై పిటిషన్లు వేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించేలా పిటిషన్‌లు వేసినందుకు హీరా గ్రూప్‌, ఆ కంపెనీ డైరెక్టర్‌ నౌహీరా షేక్‌కు రూ. 5 కోట్లు జరిమానా విధించింది. మెటల్‌ స్ర్కాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ (ఎంఎ్‌సటీసీ) లిమిటెడ్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఈ నెల 26న ఆన్‌లైన్‌ వేలం కోసం ఆ గ్రూపునకు చెందిన 59 ఆస్తులను ఈడీ లిస్ట్‌ చేసింది. ఆ ఆస్తుల మార్కెట్‌ విలువ కంటే తక్కువకు బిడ్డింగ్‌ ధరను కోట్‌ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆ గ్రూపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం.. పిటిషనర్‌ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు స్వయంగా అనుమతి ఇచ్చిన తర్వాత వేలం ప్రక్రియను అడ్డుకోవడాన్ని తప్పుపట్టింది. రూ. 5 కోట్ల జరిమానాను విధించింది. దానిని ఎనిమిది వారాల్లోగా ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది.

Updated Date - Dec 19 , 2025 | 04:59 AM