Telangana High Court: ఇలా మొదలైన నామినేషన్లు అలా బ్రేకేసిన హైకోర్టు!
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:13 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన 9వ నంబర్ జీవో...
ఉదయాన్నే నోటిఫికేషన్లు ఇచ్చిన కలెక్టర్లు.. 119మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
స్టే రావడంతో ఎన్నికల ప్రక్రియ నిలిపివేత.. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన 9వ నంబర్ జీవో మీద స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల షెడ్యూల్ నిలిచిపోయింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, సెప్టెంబరు 29న జారీచేసిన షెడ్యూల్ మేరకు పలు జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. దాంతో కొంతమంది ఔత్సాహికులు నామినేషన్లు కూడా వేశారు. ఈ నేపథ్యంలో సదరు నోటిఫికేషన్లను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్‌లు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నామినేషన్లకు బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై ఎస్‌ఈసీ కమిషనర్ సంబంధిత విభాగాలతో సమీక్షించారు. హైకోర్టు సూచనలతో పాటు ఎన్నికల ప్రక్రియపై ఏం చేయాలన్న దానిపై కూడా న్యాయ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వారి సూచనల మేరకే ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ గెజిట్‌ను సిద్ధంచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం చూపే పరిష్కారాలను బట్టి ఎన్నికలపై ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకొంటామని ఎన్నికల సంఘం విభాగాలు తెలిపాయి. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు? ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చర్చ కొనసాగుతోంది. ఏడాదిన్నర తర్వాత స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడినప్పటికీ కోర్టు తీర్పుతో బ్రేక్ పడటం ఆశావహులను నిరాశకు గురిచేసింది. పూర్తి విచారణకు హైకోర్టు ఆరువారాల గడువు విధించిన నేపథ్యంలో న్యాయస్థానం తీసుకొనే తదుపరి నిర్ణయాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాల భర్తీ కోసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం పలు జిల్లాల కలెక్టర్లు గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో పలు మండలాల్లో కొందరు నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానాలకు 16 మంది, ఎంపీటీసీ స్థానాలకు 103 మంది తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. కోర్టులో విచారణ నేపథ్యంలో తొలిరోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు చాలామంది సిద్ధపడలేదు.