Action Against KCR: కేసీఆర్‌పై జనవరి 19 వరకుచర్యలొద్దు
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:02 AM
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితాసభర్వాల్‌పై ఎలాంటి....
ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితాసభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే ఏడాది జనవరి 19 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగానికి కారణమైన కేసీఆర్, హరీశ్‌రావు ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. తమ వాదన వినకుండా, సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా, తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడం చెల్లదని.. దాన్ని కొట్టేయాలని వారు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం.. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు రావటంతో, కౌంటర్లు దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. అయితే, తగినంత సమయం ఇచ్చినా కేసీఆర్‌కు సంబంధించిన ఒక్క పిటిషన్‌పెనే కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు, వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు మూడువారాలు సమయం ఇస్తున్నామని పేర్కొంది. విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది.