Telangana High Court: స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:41 AM
స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాగంలోని ఆర్టికల్ 243(3) స్పష్టంగా పేర్కొంటోందని...
ఈ నెల 24 నాటికి నిర్ణయం తెలియజేయండి
ఆరు నెలలకు మించి స్థానిక సంస్థలు ఖాళీగా ఉండొద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రిజర్వేషన్లు 50ు మించకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని మరోసారి సూచన
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాగంలోని ఆర్టికల్ 243(3) స్పష్టంగా పేర్కొంటోందని, అంతకు మించి ఖాళీగా ఉంచడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది నిర్ణయం తీసుకుని, ఈ నెల 24 నాటికి తమకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నిలిపేయడాన్ని సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మండలం కొత్త కొమ్ముగూడానికి చెందిన సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9ను మాత్రమే హైకోర్టు నిలిపివేసిందని, ఎన్నికలను ఆపేయాలని ఏమీ చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినా ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ నిలిపివేయడం సరికాదని, ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మాకు తెలుసు. కానీ రాజ్యాంగం నిర్దేశించిన గడువును కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అనుసరించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల గడువు ముగిశాక ఆరు నెలలకు మించి ఖాళీగా ఉంచడానికి వీలుండదు’’ అని ధర్మాసనం పేర్కొంది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నెల 24 నాటికి నిర్ణయాన్ని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.