Telangana High Court: ఏపీపీల తొలగింపుపై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:03 AM
బీఆర్‌ఎస్ హయాంలో జిల్లా కోర్టుల్లో నిర్దిష్ట పదవీకాలం ప్రాతిపదికన నియామకమైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు.. నేడూ విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో జిల్లా కోర్టుల్లో నిర్దిష్ట పదవీకాలం ప్రాతిపదికన నియామకమైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎంత మందిని తొలగించారు, వారి పదవీకాలం ఇంకెంత ఉంది, కొత్తగా ఎందరిని నియమించారు వంటి వివరాలను సమర్పించాలని తెలిపింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ప్రభుత్వం తొలగించిందంటూ న్యాయవాది టీ వెంటేశ్వరప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో 12 మంది వేర్వేరు పిటిషన్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని తొలగిస్తూ ఈ నెల 10న ప్రభుత్వం జీవో జారీచేసిందని తెలిపారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వారిని ఎప్పుడైనా తొలగించే అధికారం సర్కార్‌కు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.