Telangana High Court: ఈ దాటవేత ధోరణి ఎన్నాళ్లు?
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:33 AM
సినిమా టికెట్ ధరల పెంపుపై దాటవేత ధోరణి ఎన్నాళ్లు కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు....
ఇష్టమొచ్చినట్లు టికెట్ ధరలు పెంచుతారా?
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
‘ఓజీ’ టికెట్ ధరల పెంపు మెమో సస్పెన్షన్
బుధవారం నాటి ఆదేశాల పునరుద్ఘాటన
అమలు చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్ ధరల పెంపుపై దాటవేత ధోరణి ఎన్నాళ్లు కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. సదరు టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లలో కౌంటర్‌లు దాఖలు చేయకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టికెట్ ధరలను నియంత్రిస్తూ జారీ అయిన జీవో 120ని ఎందుకు అమలు చేయడం లేదు? సదరు జీవోను కచ్చితంగా అమలు చేయాలని ఇదే హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. జీవో 120, హైకోర్టు తీర్పులు అమలులో ఉండగా మళ్లీ టికెట్ ధరలు పెంచుకునేలా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో ఎలా జారీచేస్తారు?’’ అని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు మెమోను శుక్రవారం తాజాగా మళ్లీ సస్పెండ్ చేసింది. బుధవారం రోజు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే ధ్రువీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాటిని సంబంధిత అధికారులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఓజీ టికెట్ రేట్లు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ బర్ల మల్లేశ్ యాదవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత బుధవారం రోజు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి సదరు మెమోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ వాదన వినకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటూ గురువారం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపేసిన డివిజన్ బెంచ్ అందరి వాదన విని శుక్రవారమే మళ్లీ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ అంశంపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మళ్లీ విచారణ చేపట్టింది. నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుదర్శన్ థియేటర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, అవినాశ్ దేశాయి వాదనలు వినిపించారు. ఇది భారీ బడ్జెట్ సినిమా అని, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందే భారీ బడ్జెట్ సినిమాలు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సినిమాకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికీ లేని బాధ పిటిషనర్ ఒక్కడికే ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్‌కు కావాలంటే రూ.100 చొప్పున ఆయన కుటుంబం మొత్తానికి 20 టికెట్లు ఇస్తామని తెలిపారు.
మొదటి రోజే సినిమా చూడాలి, అదీ సాధారణ ధరలకే చూడాలి అనే పిటిషనర్ ధోరణి సమంజసం కాదన్నారు. వారం రోజులు వేచి చూస్తే సాధారణ ధరలకే చూడొచ్చని చెప్పారు. టికెట్లు ఇప్పటికే బుకింగ్ అయిపోయాయని.. వాటిపై ఇప్పటికే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టామని, వారందరి వాదన వినకుండా ఏకపక్షంగా టికెట్ రేట్ల పెంపును సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదిస్తూ, మెమో జారీచేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ, నిర్మాణ సంస్థ దానం తమకు అక్కర్లేదని, చట్టాన్ని కాపాడటానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ గతంలో చాలా పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిలో ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఓజీ టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మెమోను మళ్లీ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది. ప్రభుత్వం తప్పకుండా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
డీవీవీ ట్వీట్‌పై వివాదం
ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు మెమో సస్పెన్షన్ కేవలం పిటిషనర్ బర్ల మల్లేశ్ యాదవ్ ఒక్కడికే వర్తిస్తుందని పేర్కొంటూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ పెట్టడంపై వివాదం నెలకొంది. హైకోర్టు టికెట్ ధరల పెంపు మెమో మొత్తాన్ని సస్పెండ్ చేసిందని, అది రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని, ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం సమంజసం కాదని పిటిషనర్ ఖండించారు.