TS High Court: మల్కాపూర్ బాలాజీ ఆస్తులు ఇనాం భూములే
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:22 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని 10 నుంచి 366 వరకు ఉన్న వివిధ సర్వే నెంబర్లలోని వివాదాస్పద 77 ఎకరాలు శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన...
హైకోర్టు తీర్పు
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని 10 నుంచి 366 వరకు ఉన్న వివిధ సర్వే నెంబర్లలోని వివాదాస్పద 77 ఎకరాలు శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఇనాం భూములే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇనాం ట్రైబ్యునల్‌గా వ్యవహరించే ఆర్డీవో 2003లోనే ఈ భూములకు సంబంధించి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీచేశారు. దీనిని రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సైతం సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఆ భూములు తమ పూర్వీకులవని, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని పేర్కొంటూ శేరి నారాయణరెడ్డి మరో 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. 1951, 1954 నాటి సేత్వార్, కాస్ర పహాణీ ప్రకారం ఆ భూములు వారి పూర్వీకుల పట్టా భూములని పేర్కొన్నారు. వారికి తగిన అవకాశం ఇవ్వకుండా వాటని ఆలయ భూములుగా ప్రకటించడం చెల్లదని పేర్కొన్నారు. దేవాదాయశాఖ తరఫున న్యాయవాది వాదిస్తూ.. 1958లో జారీచేసిన ముంతఖాబ్ ప్రకారం అవి దేవాదాయశాఖ ఆస్తులుగా గుర్తించారని, అందులో భాగంగానే ఓఆర్సీ జారీచేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ముంతఖాబ్, దేవాదాయ శాఖ ఎంట్రీల ద్వారా శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చట్టబద్ధమైన టైటిల్ లభించిందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల్లో ఆలయ భూములగా నమోదైన ఎంట్రీలను పిటిషనర్ల పూర్వీకులు గతంలో ఎప్పుడూ సవాల్ చేయలేదని పేర్కొంది. పిటిషనర్ల వాదనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.