Share News

High Court: జూబ్లీహిల్స్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు..పిటిషన్‌పై విచారణ ముగింపు

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:26 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు...

High Court: జూబ్లీహిల్స్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు..పిటిషన్‌పై విచారణ ముగింపు

  • ఫిర్యాదును పరిశీలిస్తామని ఈసీ చెప్పినందున ప్రత్యేకంగా ఉత్తర్వులు అవసరం లేదన్న హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. పిటిషనర్లు ఇచ్చిన ఫిర్యాదులను చట్టప్రకారం పరిశీలించి, పరిష్కరిస్తామని ఎన్నికల కమిషన్‌ చెబుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌ ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లు ఉన్నాయంటూ హైకోర్టులో మాగంటి సునీత, కేటీఆర్‌ గురువారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. 1942 మందికి అదే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇతర నియోజకవర్గాలకు చెందిన 12 వేల మందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయని, తెలిపారు. ఈ తరహా అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి వాదిస్తూ జూబ్లీహిల్స్‌ ఓటర్ల జాబితాను జూలైలోనే ప్రచురించి, అభ్యంతరాలు కోరామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ పిటిషనర్ల ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని.. పిటిషనర్ల ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలిస్తామని ఈసీ చెబుతుున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది.

Updated Date - Oct 17 , 2025 | 02:26 AM