Share News

High Court Cancels Group 1 Final Results: గ్రూప్‌-1 ఫలితాల రద్దు

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:43 AM

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల్లో మెరిట్‌ సాధించి.. ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల అనంతరం టీజీపీఎస్సీ...

High Court Cancels Group 1 Final Results: గ్రూప్‌-1 ఫలితాల రద్దు

  • మెయిన్స్‌ మార్కులు, ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు

  • జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని ఆదేశం

  • 8 నెలల్లో పూర్తి చేయాలి.. లేదంటే మెయిన్స్‌ రద్దు చేస్తాం

  • టీజీపీఎస్సీ అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు

  • గతంలో 2 సార్లు గ్రూప్‌-1 పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు

  • తన సొంత నిబంధనల్ని తానే తుంగలో తొక్కింది: హైకోర్టు

  • 222 పేజీల తీర్పు వెలువరించిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల్లో మెరిట్‌ సాధించి.. ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల అనంతరం టీజీపీఎస్సీ ప్రకటించిన తుది మార్కుల జాబితాను, సాధారణ ర్యాంకుల జాబితాను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. మెయిన్స్‌కు హాజరైన మొత్తం అభ్యర్థుల సమాధాన పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పునర్‌ మూల్యాంకనంలో మోడరేషన్‌ పద్ధతిని అవలంబించాలని, మాన్యువల్‌గా పేపర్లు దిద్దాలని పేర్కొంది. దీనికి సంబంధించి ‘సంజయ్‌సింగ్‌ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ యూపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలని సూచించింది. పునర్‌ ముల్యాంకనం చేపట్టి మళ్లీ తాజా ఫలితాలను ప్రకటించడం ద్వారా 563 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపింది. పునర్‌ మూల్యాంకనం చేపట్టకపోతే మెయిన్‌ పరీక్షలను మొత్తం రద్దు చేస్తామని జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు.. మెయిన్‌ పరీక్షలు రద్దయితే ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారందరికీ మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని తెలిపింది. ఈ మేరకు జూలై 7న రిజర్వు చేసిన 222 పేజీల తీర్పును తాజాగా వెలువరించింది.

టీజీపీఎస్సీ పూర్తిగా విఫలం..

గ్రూప్‌-1 ఫలితాలపై తీర్పులో టీజీపీఎస్సీ పనితీరుపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం మండిపడింది. ‘‘పిటిషనర్లు, టీజీపీఎస్సీ, ఇతరులు సమర్పించిన వాదనలు, గత తీర్పులు, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన తర్వాత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ దారుణంగా విఫలమైందని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రతను పాటించకపోవడంతోపాటు వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించింది. తన సొంత నిబంధనలను తానే తుంగలో తొక్కింది. టీజీపీఎస్సీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థులు ఈ పరీక్షల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కోచింగ్‌తోపాటు ప్రతిరోజూ 10 నుంచి 12 గంటలపాటు పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. కొంతమంది అభ్యర్థులు తాము చేస్తున్న ఉద్యోగాలకు సైతం రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. కమిషన్‌ విధానపరమైన అంశాలతోపాటు సమాధాన పత్రాల మూల్యాంకన పద్ధతిలో సైతం దారుణంగా విఫలమైంది. ఇదివరకే గ్రూప్‌-1 పరీక్షలు రెండుసార్లు రద్దయినప్పటికీ గత అనుభవాల నుంచి కమిషన్‌కు బుద్ధిరాలేదు. గత తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదు’’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


మూల్యాంకనంపైనే ప్రధాన ఆరోపణలు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి, బయోమెట్రిక్‌ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు కొట్టేయడం వల్ల రెండోసారి గ్రూప్‌-1 పరీక్షలు రద్దయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేశారు. గతేడాది జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి.. అందులో అర్హత సాధించిన 21 వేల మంది అభ్యర్థులకు అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేయడంతోపాటు మొత్తం ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాల జారీ మాత్రమే మిగిలి ఉంది. ఈ దశలో ప్రధాన పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సరిగా చేపట్టలేదని, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, రెండు సెంటర్ల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని ఆరోపిస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాక.. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, సబ్జెక్టుకు సంబంధం లేని ఎవాల్యుయేటర్లు పేపర్లు దిద్దారని, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులను ఎవాల్యుయేటర్లుగా తీసుకున్నారని తెలిపారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెండు హాల్‌ టికెట్టు ఎందుకు?

ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలకు ప్రత్యేకంగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. కమిషన్‌ రూల్స్‌లోగానీ, నోటిఫికేషన్‌లో గానీ ఎక్కడా రెండు హాల్‌టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. ఈ విషయంలో కమిషన్‌ చర్య అనుమానాలకు తావిచ్చేలా ఉందని పేర్కొంది. కమిషన్‌ చెప్పినట్లు పరీక్షా కేంద్రాల కేటాయింపులో ర్యాండమ్‌ పద్ధతిని పాటిస్తే కేవలం రెండు కేంద్రాల్లోనే మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఎలా వచ్చారని ప్రశ్నించింది. సమాధాన పత్రాల మూల్యాంకనంలో మూడంచెల పద్ధతిని పాటించినా.. మొదటి రెండు అంచెల్లో మాత్రమే బార్‌ కోడ్‌, బబ్లింగ్స్‌ ఉన్నాయని, మూడో దశలో లేవని ధర్మాసనం పేర్కొంది. దీంతో మార్కులను మార్చడానికి, మోసం చేయడానికి అన్నిరకాల అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. వాస్తవానికి మూడో దశ మూల్యాంకనం గురించి కమిషన్‌ నోటిఫికేషన్‌లో ఎక్కడా పేర్కొనలేదని, తద్వారా తన రూల్స్‌ను తానే అతిక్రమించిందని పేర్కొంది. కమిషన్‌ నిబంధనల ప్రకారం.. అందరు అభ్యర్థుల మార్కులను సబ్జెక్టులవారీగా పబ్లిష్‌ చేయాల్సి ఉండగా.. ఎవరి మార్కులు వారు మాత్రమే చూసుకునేలా పెట్టారని, తద్వారా కమిషన్‌ తన రూల్స్‌ను తానే తుంగలో తొక్కిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేదనేవిధంగా కమిషన్‌ వ్యవహరించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. జనరల్‌ ఇంగ్లీ్‌షలో అర్హత సాధించని కొందరు అభ్యర్థుల ఇతర పేపర్లను దిద్దడమే కాకుండా..వారి మొత్తం మార్కులను పబ్లిష్‌ చేయడం ద్వారా కమిషన్‌ తప్పు చేసిందని, అసలు పారదర్శకత లేదనడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేసింది.


ఎవాల్యుయేటర్ల ఎంపికలో లోపాలు..

మూల్యాంకనం చేసే ఎవాల్యుయేటర్ల ఎంపిక విషయంలోనూ కమిషన్‌ తప్పు చేసిందని హైకోర్టు పేర్కొంది. ఎవాల్యుయేటర్లుగా రెగ్యులర్‌ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకుంటామని చెప్పి.. రిటైర్‌ అయిన వారిని సైతం తీసుకుందని తెలిపింది. ప్రైవేటు ట్యూటర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎంఏ మాలిక్‌ ఎవాల్యుయేటర్‌గా సేవలందించారని, ఆయన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఉన్నారని, ‘ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌’లో పనిచేయలేదని కమిషన్‌ పేర్కొంటున్నప్పటికీ.. ఆయన రాసిన ‘ఇండియన్‌ ఎకానమీ ఫర్‌ గ్రూప్‌-1’ పుస్తకంలో ఆర్‌సీ రెడ్డి మ్యాగజైన్‌ కోసం పనిచేసినట్లు ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన అభ్యర్థులకు ఆయన గైడ్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఈ అంశాన్ని బయటపెట్టిన పిటిషనర్లను కేసు పెడతామని టీజీపీఎస్సీ బెదిరించడమేంటని ప్రశ్నించింది. మూల్యాంకనం విషయంలో కమిషన్‌ సరైన పద్ధతి ఏదీ పాటించలేదని పేర్కొంది. ‘‘తెలంగాణ ఉద్యమంపై ప్రశ్నకు ఏయే అంశాలు ప్రస్తావిస్తే ప్రామాణిక మార్కులు ఇస్తారు? ఒక అభ్యర్థి ఒక పేజీలోనే అన్ని కీలక విషయాలు ప్రస్తావిస్తారు. మరో అభ్యర్థి పది పేజీలు రాసినా ప్రామాణిక అంశాలు రాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మార్కులెలా ఇస్తారని ఈ కోర్టు అడిగిన ప్రశ్నకు కమిషన్‌ నుంచి సమాధానం లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్లు దిద్దే ఎవాల్యుయేటర్లు విషయ నిపుణులు కాబట్టి ఎలాంటి కీ ఉండదని, వారే చూసుకుంటారనే సమాధానం ద్వారా కమిషన్‌ సరైన పద్ధతి పాటించలేదని స్పష్టమవుతోందని పేర్కొంది. మోడరేషన్‌ పద్ధతి పాటించామని మొదట పేర్కొన్న కమిషన్‌.. కౌంటర్‌లో మాత్రం మోడరేషన్‌ పద్ధతి అవసరం లేదని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తెలుగు మీడియం అభ్యర్థుల సమాధాన పత్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపింది. ఇంగ్లీష్‌ మీడియం అభ్యర్థులు 89.88ు ఎంపికైతే.. తెలుగు మీడియం అభ్యర్థులు 9.95ు ఎంపికయ్యారని పేర్కొంది. 18, 19 సెంటర్లలో ఎక్కువ మంది మహిళలు ఎంపికయ్యారని తెలిపింది. 719 మంది అభ్యర్థులకు సమాన మార్కులు రావడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

Updated Date - Sep 10 , 2025 | 03:43 AM