High Costs of Thermal Power Plant: ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే!
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:20 AM
దేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మనదేశంలో..
భారీగా పెరిగిన థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ వ్యయం
యాదాద్రిలో మెగావాట్‌కు రూ.10 కోట్లకు చేరిక
రామగుండం ప్లాంటులో 14.6 కోట్లు
అయినా థర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదంటున్న సీఈఏ
2035 కి దేశవ్యాప్తంగా 60 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరం
లేదంటే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే
థర్మల్ ప్లాంట్లను జెన్‌కోనే నిర్మించాలంటున్న నిపుణులు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మనదేశంలో విద్యుత్ రంగంలో ఇప్పటికీ థర్మల్ విద్యుత్‌దే సింహభాగం. కాలుష్య రహితమైన జల, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ.. వాటికి పరిమితులు ఉండటంతో ఇప్పటికీ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడుతున్నాం. ఇటీవలి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగినప్పటికీ.. నిర్మించక తప్పదని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) స్పష్టంచేసింది. 2035 నాటికి 60 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ దేశ ఉత్పాదక సామర్థ్యంలోకి చేరకపోతే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించింది.
ఏటేటా పెరుగుతున్న థర్మల్ వ్యయం
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో 2014లో ఒక మెగావాట్ నిర్మాణ అంచనా వ్యయం రూ.4.25 కోట్లు. 2017 నాటికిఅది రూ.7.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తయ్యే నాటికి మెగావాట్‌కు రూ.10 కోట్లు కానుంది. రామగుండంలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల సూపర్ థర్మల్ క్రిటికల్ విద్యుత్ కేంద్రంలో ఒక మెగావాట్‌కు రూ.14.6 కోట్లు ఖర్చవుతుందని ఎన్టీపీసీ అంచనా వేయగా, రూ.13.6 కోట్లు అవుతుందని జెన్‌కో లెక్కలు వేసింది. ఆర్థిక, పర్యావరణ కోణంలో చూస్తే థర్మల్ పవర్‌ప్లాంట్లు ఏమాత్రం మంచివి కావని చెబుతున్నా.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాటి ఏర్పాటు అనివార్యమని సీఈఏ చెబుతోంది. సౌర విద్యుత్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. పవన విద్యుత్ గాలి ఉంటే తప్ప లభించదు. జలవిద్యుత్ వానాకాలంలోనే అధికంగా అందుబాటులో ఉంటుంది. ఇక పంప్డ్ స్టోరేజీ కూడా నిర్ణీత సమయానికేదొరుకుతుంది. థర్మల్ విద్యుత్ మాత్రం కచ్చితంగా 24 గంటలపాటు లభిస్తుంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. 2014-15లో రోజుకు 6,755 మెగావాట్ల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 17,162 మెగావాట్లకు చేరింది. 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు చేరుతుందని సీఈఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో కనీసం 40 శాతం థర్మల్ విద్యుత్ లేకపోతే గ్రిడ్‌ను కాపాడుకోవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. గత ఏప్రిల్ 28న యూర్‌పలో గ్రిడ్ కుప్పకూలి స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఫ్రాన్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ గ్రిడ్ పునరుద్ధరణకు 12-16 గంటల సమయం పట్టింది. ఇలాంటి అనుభవాల దృష్ట్యా థర్మల్ విద్యుత్‌కు ప్రోత్సాహం ఇవ్వక తప్పదని అంటున్నారు.
రామగుండం, పాల్వంచ ప్లాంట్లు కీలకమే..
రామగుండం, పాల్వంచలో నిర్మిస్తున్నవి పిట్‌హెడ్ (బొగ్గు గని ఉపరితల భాగం) ప్లాంట్లే. దేశంలో పిట్‌హెడ్ ప్లాంట్ల వల్లే తక్కువ ధరకు కరెంట్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాల్వంచలో ఇంకా 800 మెగావాట్ల ప్లాంటునిర్మాణానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 1,800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గతంలో 30 ఏళ్లు దాటిన ప్లాంట్లను మూసివేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించటంతో పాల్వంచలో 720 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లను మూసేశారు. కేటీపీఎ్‌సలో మూసేసిన కేంద్రాలన్నీ 40 ఏళ్లపాటు విద్యుదుత్పత్తి చేశాయి. ఒక కేంద్రం 53 ఏళ్లపాటు నడిచింది. రామగుండంలో ఆర్‌టీఎ్‌స-బీ థర్మల్ కేంద్రాన్ని గతంలోనే మూసేశారు. రామగుండం విద్యుత్ కేంద్రంనిర్మాణానికి రూ.10,893.05 కోట్లు ఖర్చవుతుందని తెలంగాణ జెన్‌కో అంచనా వేసింది. ఈ లెక్కన ఒక మెగావాట్‌కు రూ.13.62 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మొత్తం వ్యయంలో 75 శాతాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీ ఎ్‌ఫసీ)/రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నుంచి రుణంగా, మరో రూ.2,723.26 కోట్లను ప్రభుత్వం ఈక్విటీ గా సమకూర్చాల్సి ఉంటుంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే యూనిట్ విద్యుత్ రూ.7.97లకు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంటుకు ఏటా 3.053 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుందని లెక్కకట్టారు. రానున్న రోజుల్లో ఏర్పడే విద్యుత్ డిమాండ్ తీర్చాలంటే ఈ కేంద్రం నిర్మాణం విధిగా చేపట్టాల్సిందేనని జెన్‌కో ప్రభుత్వానికి గుర్తు చేసింది.
సౌర, థర్మల్ కలిస్తే తక్కువ ధరకే విద్యుత్..
ప్రస్తుతం దేశంలో సౌరవిద్యుత్ ఒక యూనిట్ రూ.2.40 నుంచి రూ.2.90లకు లభిస్తోంది. థర్మల్ విద్యుత్ రూ.4 నుంచి రూ.6లకు దొరుకుతోంది. వినియోగంలో 60 శాతా న్ని సోలార్/పవన విద్యుత్‌తో తీర్చి... మిగిలిన 40 శాతాన్ని విధిగా థర్మల్ విద్యుత్‌ను తీసుకుంటే విద్యుత్ యూనిట్ సగటు ధరను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర అవసరాలు, గ్రిడ్ సుస్థిరత కోసం విధిగా జెన్‌కో ఆధ్వర్యంలో ప్లాంట్లు నిర్మించాలని సూచిస్తున్నారు.
చెల్లింపుల సమస్యకూ చెక్..
లేట్ పేమెంట్ సర్‌చార్జీ (ఎల్‌పీఎస్) నిబంధనల ప్రకా రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న డిస్కమ్‌లు చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే, వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారం ఎన్టీపీసీకి ఉంది. అదే జెన్‌కోలు ప్లాంట్లు నిర్మిస్తే వెసులుబాటును బట్టి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. గత పదేళ్లలో రాష్ట్రానికి ఎన్టీపీసీ విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండరాదంటే జెన్‌కోనే స్వయంగా విద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.