Share News

Operations Nearing Conclusion: కథ ముగిసినట్టేనా?!

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:57 AM

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో మావోయిస్టు పార్టీ కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి....

Operations Nearing Conclusion: కథ ముగిసినట్టేనా?!

  • హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ

  • కీలక సభ్యుల ఎన్‌కౌంటర్లతో కుదేలు

  • మిగిలినవారి లొంగుబాట్లతో డీలా

హైదరాబాద్‌/చర్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో మావోయిస్టు పార్టీ కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ కగార్‌’ చివరి దశకు చేరుకున్నట్టేనని భావిస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే డీలా పడింది. ఐదు నెలల్లో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్‌, బాలకృష్ణ, కడారి సత్యనారాయణరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోవడంతో పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఇంకా అడవిలో ఉన్న వివిధ క్యాడర్ల మావోయిస్టులు కూడా లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జనవరిలోపే ఆపరేషన్‌ కగార్‌ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలినవారిలో కొందరు పశ్చిమ బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో గణపతి, మల్లా రాజిరెడ్డి, మరో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మిగిలి ఉన్నారని సమాచారం. వీరు మాత్రమే సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నవారని, మరో నలుగురు సీసీ సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. షెల్టర్‌ జోన్‌లుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఏరివేత చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో మరిన్ని అరె్‌స్టలు లేదా ఎన్‌కౌంటర్‌లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇప్పటికే దండకారణ్యంలోని పీఎల్‌జీఏ బృందాల్లో 12 లొంగిపోయాయి. మరో 6 బృందాలు ఉండొచ్చని చెబుతున్నారు. అవి కూడా త్వరలో లొంగిపోతాయని పోలీసు వర్గాల సమాచారం. అందులోనే తెలంగాణకు చెందిన ముగ్గురు, మరో ఏపీ నేత ఉంటారని చెబుతున్నారు.

తెలుగు వారెక్కడ?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో తెలుగువారు ఐదుగురు ఉండగా, దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి తిప్పిరి అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మిగిలిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల కేశవరావు (75) వయోభారంతో కదిలే పరిస్ధితిలో లేరని తెలుస్తోంది. ఇక పాక హన్మంతు అలియాస్‌ గణేశ్‌ ఒడిశాలో యాక్టివ్‌గా ఉన్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరో సభ్యుడైన మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌(73) వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటుండగా, పసునూరి నరహరి ఈఆర్‌బీలో యాక్టివ్‌గా ఉన్నారని తెలుస్తోంది.


భర్తీ చేయలేని లోటు

పీపుల్స్‌ వార్‌ దళాలకు అడవిలో దారి చూపించే గైడ్‌ స్థాయి నుంచి దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, అడవిని అసాంతం అర్థం చేసుకున్న గెరిల్లా వీరుడిగా ఎదిగిన హిడ్మా మరణం ఆ పార్టీకి భర్తీ చేయలేని లోటుగా మాజీ మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాల నేతలు పరిగణిస్తున్నారు. పీఎల్‌జీఏ సైన్యంలో ఫస్ట్‌ బెటాలియన్‌ కమాండర్‌గా దళాలను ముందుకు నడిపిన హిడ్మా ఎన్‌కౌంటర్‌ ఆ పార్టీకి తీవ్రనష్టం కలిగిస్తుందని పోలీసులు సైతం పేర్కొంటున్నారు. వాస్తవానికి హిడ్మా తన చుట్టూ సైన్యం లేకుండా ఎక్కడకూ వెళ్లడని, ఆయన రంపచోడవరం అడవిలో ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే ఆయన సైన్యం విజయవాడలో పట్టుబడిందని పోలీసులు చెబుతున్న విషయాలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయని పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్‌ అన్నారు.

నేడు పూవర్తిలో హిడ్మా అంత్యక్రియలు?

హిడ్మా దంపతులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని హిడ్మా సొంత గ్రామం సుకుమా జిల్లా పూవర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడు చనిపోయినట్టు హిడ్మా తల్లికి పోలీసులు సమాచారం అందించారు. దీంతో 80 ఏళ్ల వయసున్న ఆమె ఓ చెట్టు కింద కూలబడి భోరున విలపించిందని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం హిడ్మా కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే బుధవారం పూవర్తిలో హిడ్మా దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలతో ఛత్తీ్‌సగఢ్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 04:57 AM