Hyderabad Traffic: అడుగుకో వాహనం.. ఆగమాగం!
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:54 AM
దసరా సెలవులకు ఊళ్లకు వెళ్లిన వారందరూ తిరిగి హైదరాబాద్‌కు పయనం కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి...
చౌటుప్పల్ వద్ద ఎన్‌హెచ్-65పై ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లో కిటకిటలాడిన బస్సులు, మెట్రో రైళ్లు
చౌటుప్పల్ రూరల్/కేతేపల్లి/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులకు ఊళ్లకు వెళ్లిన వారందరూ తిరిగి హైదరాబాద్‌కు పయనం కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65) కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్ మండల పరిధిలోని రెడ్డిబావి నుంచి తూఫ్రాన్‌పేట వరకు వేలాది వాహనాలు హైవేపై బారులుతీరాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ నెలకొనడంతో చౌటుప్పల్ పట్టణమంతా వాహనాలతో నిండిపోయింది. పట్టణంలో నాలుగు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారితోపాటు సర్వీసు రోడ్డుపైనా ట్రాఫిక్ స్తంభించింది. పంతంగి టోల్ ప్లాజాను దాటడానికి వాహనదారులకు అరగంటపైగా సమయం పట్టింది. సాధారణ రోజుల్లో ఇక్కడి నుంచి 35వేల వాహనాల రాకపోకలు సాగిస్తుండగా.. సోమవారం అదనంగా మరో 25వేల వాహనాలు ప్రయాణించాయి. పండుగ సెలవులకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్సులు, మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. విజయవాడ వైపు నుంచి వచ్చిన వందలాది మంది ప్రయాణికులు ఒకేసారి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు రావడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. హన్మకొండ నుంచి వచ్చిన వారు ఉప్పల్ మెట్రోస్టేషన్, నిజామాబాద్ నుంచి వచ్చిన వారు మియాపూర్ స్టేషన్, కరీంనగర్ నుంచి వచ్చిన వారు జేబీఎస్ స్టేషన్‌లో బారులుదీరడంతో మధ్యాహ్నం వరకు మెట్రో రైళ్లలో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. సోమవారం 5 లక్షల మార్కును దాటినట్లు మెట్రోవర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, బేగంపేట, చర్లపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులతో తీవ్ర రద్దీ నెలకొంది. కాగా, చౌటుప్పల్ నుంచి హయత్‌నగర్, ఎల్బీనగర్ చేరుకోవడానికి సాధారణ రోజుల్లో 40 నిమిషాల సమయం పడితే, సోమవారం ఏకంగా 2.30 గంటలపైగా పట్టింది. నలువైపుల నుంచి వేలాది కార్లు ఒకేసారి హైదరాబాద్ చేరుకోవడంతో.. ప్రధాన రోడ్లపై రద్దీ నెలకొంది. ఈ వారంలో మొదటి వర్కింగ్ డే కావడంతో ఐటీ కారిడార్‌లోని కొండాపూర్ శరత్ సిటీ మాల్ నుంచి హైటెక్స్ మీదుగా మాదాపూర్ సైబర్ టవర్స్, దుర్గం చెరువు వరకు వాహనాలు నిలిచిపోయాయి.