Flood Warning: రేపు అతి భారీ వర్షాలు!
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:32 AM
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది...
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
నేడు పలు జిల్లాల్లో వానలు
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
హైదరాబాద్, బాసర, గద్వాల, నాగార్జునసాగర్, పుల్‌కల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఓ ఆవర్తనం గురువారానికి అల్పపీడనంగా మారనుందని, శుక్రవారానికి అది వాయుగుండంగా బలపడి శనివారం తీరాన్ని దాటనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 586.60 అడుగుల(303.4310టీఎంసీలు) నిల్వ ఉంది. సాగర్‌కు ఎగువ నుంచి 3,66,816 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,20,046 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి బుధవారం 3.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 3,45,730 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 2.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి సుంకేసులకు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 22 వేల క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. మరోపక్క, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృ తి పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టులోని మొత్తం ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 69,068 క్యూసెక్కులు ఉండగా 67,531 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం రాత్రి వరకు 16.673 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. సంగారెడ్డి సమీపంలోని మంజీర రిజర్వాయర్ వద్ద కూడా వచ్చిన నీటిని వచ్చినట్లుగానే ఘనపురం ప్రాజెక్టుకు వదులుతున్నారు. కాగా, మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసరలో భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతాలన్నీ నీటమునిగాయి. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌తో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
సికింద్రాబాద్-ముంబై మార్గంలో పలు రైళ్లు ఆలస్యం, రీషెడ్యూల్
హైదరాబాద్‌సిటీ: సికింద్రాబాద్-ముంబై మార్గం లో పలు ముఖ్యమైన రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. కుర్దువాడి-షోలాపూర్ మధ్య ఓ రైల్వే వంతనపై ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో కొన్ని రైళ్లను దారిమళ్లించిన రైల్వే అధికారులు మరికొన్నింటిని బుధవారం రీషెడ్యూల్ చేశారు. 22731 ముంబై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 10గంటలు ఆలస్యంగా నడుస్తున్నందున ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన హుస్సేన్‌సాగర్(12701) ఎక్స్‌ప్రె్‌సను రీషెడ్యూల్ చేశారు. ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దురం తో ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్- పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా రీషెడ్యూల్ అయ్యాయి. అలాగే, సి కింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా బుధవారం 4గంటలు ఆలస్యంగా (రాత్రి 8.50గంటలకు) రీషెడ్యూల్ చేశారు. రైళ్లు రీషెడ్యూల్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.