Heavy Rains Alert: నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:35 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది....
బంగాళాఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన
భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 94 గొర్రెల మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. కాగా, గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో అత్యధికంగా 22 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 21.7, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్ ముంపునకు గురైంది. దీంతో పాఠశాల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది శుక్రవారం ఉదయం అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట శివారులోని గోదావరి ప్రాంతంలో గురువారం రాత్రి పిడుగులు పడగా.. ఆరు మందలకు చెందిన 94 గొర్రెలు మరణించాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన వంగూరు వెంకన్న ఇంటిపై గురువారం రాత్రి క్షణాల వ్యవధిలో రెండు పిడుగులు పడ్డాయి. దీంతో వెంకన్న భార్య వెంకటమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. ఆ ఇంటి పైకప్పుపై రెండు చోట్ల బీటలు పడ్డాయి. ఇక, హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో పరవళ్లు తొక్కుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోలెవల్ బ్రిడ్జిలపై రాకపోకలను ఆపేశారు. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వంతెన వద్ద మానేరు ప్రవాహం ఒక్కసారి పెరిగిపోగా.. ఇసుక తరలింపునకు వచ్చిన 4ట్రాక్టర్లు చిక్కుకుపోయాయి. వాటితోపాటు నలుగురు డ్రైవర్లు చిక్కుకుపోగా వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌లోకి వరద పెరగడంతో 36వేల క్యూసెక్కులను వదిలి పెడుతున్నారు. కాగా, నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి 1,00,979 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు తెరిచి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 589.90 అడుగులుగా (311.7462టీఎంసీలు)గా నమోదైంది. ఎగువ నుంచి వరద రాక తగ్గటంతో ఈ నెల 10వ తేదీన గేట్లు మూసివేశారు. గురువారం అర్ధరాత్రి తర్వాత వరద పెరగడంతో మళ్లీ గేట్లు తెరిచారు. ఈ నీటి సంవత్సరంలో సాగర్ గేట్లు తెరవడం ఇది నాలుగో సారి. కాగా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 88.478 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 12 గేట్ల ద్వారా 64,884 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు.
పోలీసు సాయం.. నిలిచిన ప్రాణం
సాయం కోసం పిలుపు అందిన వెంటనే పోలీసులు స్పందించడంతో వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ వ్యక్తి ప్రాణం నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామ శివారులోని తాళ్లవాగు ప్రవాహంలో చిక్కుకొని వాగు కల్వర్టుపై ఇరుక్కుపోయిన ఓ ద్విచక్రవాహనాదారుడిని పోలీసులు రక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలి ఉన్నాయి. గోపాల్‌పూర్‌కు చెందిన గాజుల రాకేష్.. హుజురాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తుంటాడు. హుజురాబాద్ నుంచి గురువారం అర్ధరాత్రి తన మోపెడ్‌పై గోపాల్‌పూర్‌కు బయలుదేరిన రాకేష్.. మార్గమధ్యలో తాళ్లవాగు కల్వర్టుపై ఇరుక్కుపోయాడు. తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఇంటికి వెళ్లిపోవాలనే ఆత్రుతతో కల్వర్టు దాటేందుకు యత్నించాడు. కానీ, ప్రవాహ తీవ్రతకు అదుపు తప్పి వాహనంపై నుంచి కిందపడ్డ రాకేష్.. కల్వర్టు స్తంభాలను గట్టిగా పట్టుకున్నాడు. ఆపై, సాయం కోసం ఆపకుండా కేకలు వేశాడు. కల్వర్టు సమీపంలో నివసించే ఓ వ్యక్తి ఆ కేకలు విని 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాకే్‌షను తాళ్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు. మొత్తంగా అరగంటకు పైగా రాకేష్ నరకయాతన పడ్డాడు.

