Heavy Rains: వదలని వాన
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:59 AM
రాష్ట్రమ్మీద కమ్ముకున్న మాయదారి మబ్బు వదలడం లేదు. కురుస్తున్న చినుకుకూ విరామం ఉండటం లేదు. శరద్కాలంలో తేటనీటితో కళకళలాడాల్సిన కాలువలు మహోగ్రంగా...
కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో 13 సెంటీమీటర్ల వర్షం
కూలిన ఇళ్లు.. ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మహబూబాబాద్‌లో ఒకరి గల్లంతు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రమ్మీద కమ్ముకున్న మాయదారి మబ్బు వదలడం లేదు. కురుస్తున్న చినుకుకూ విరామం ఉండటం లేదు. శరద్కాలంలో తేటనీటితో కళకళలాడాల్సిన కాలువలు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. కొన్నిచోట్ల కట్టలు తెగుతున్నాయి. వేసిన పంటలు మట్టిపాలవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద పోటెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల శనివారం కూడా వర్షాలు పడ్డాయి. కొత్తగూడెం జిల్లా చర్లలో 13.7సెం.మీ, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 13సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 41 మండలాల్లో 6 నుంచి 11 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దాపూర్ జాతీయ రహదారి వద్ద రెస్టారెంట్లు, హోటళ్లు నీట మునిగాయి. మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రంలో ఆలయం ముందున్న ప్రసాదం కౌంటర్ షెడ్డు, క్యూలైన్ ఐరన్ బారీకేడ్లు మంజీరా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై నందివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడెం జిల్లా కరకుగూడెం మండలంలోని పలుగ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. భద్రాచలం ఉచిత అన్నదాన సత్రంలోకి నీరు చేరింది. సిద్దిపేట జిల్లాలో చేర్యాల జలదిగ్బంధమైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగులో చేపలవేటకు వెళ్లి డోర్నకల్‌కు చెందిన బందెల వెంకటేశ్వర్లు (43) గల్లంతయ్యాడు. భూపాలపల్లి జిల్లా కటారం మండలం ములుగుపల్లి-అంకుసాపూర్ మధ్య పొంగిపొర్లుతున్న చిన్నవాగును బైక్ మీద దాటేందుకు రాజు అనే యువకుడు ప్రయత్నిస్తూ వాహనంతో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈత రావడంతో ఒడ్డుకు చేరాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో ఓ పెంకుటిల్లు కూలిపోయింది. శిథిలాలు మీద పడి ఆదిత్య అనే 12ఏళ్ల బాలుడు మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి సమీపంలో ఎస్సారెస్పీ ఉప కెనాల్‌లో మేకలకాపరి దూరు కృష్ణయ్య ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు.
3జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.