Share News

Heavy Rainfall: దంచికొట్టిన వాన

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:16 AM

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 11.2 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 10.8 సెం.మీ, ఖమ్మం జిల్లా...

Heavy Rainfall: దంచికొట్టిన వాన

  • హైదరాబాద్‌లో పలు కాలనీలు జలమయం

  • మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో పొంగిన వాగులు

  • రాకపోకలు బంద్‌.. దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి పంటలు

  • భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 11.2 సెం.మీ. వర్షపాతం

  • పిడుగుపాట్లకు ఇద్దరు మహిళల మృతి

  • శ్రీశైలం 10 గేట్లు, సాగర్‌ 26 గేట్లు ఎత్తివేత

  • నేడూ భారీ వర్షాలు.. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 11.2 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 10.8 సెం.మీ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు మహిళలు పిడుగుపాట్లకు మృతిచెందారు. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. నాచారం, హయత్‌నగర్‌, కాప్రా, మల్లాపూర్‌, గాంధీనగర్‌, గౌతమ్‌నగర్‌, మీర్జాల్‌గూడ, వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హయత్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీలో 8.7 సెంమీ, కాప్రాలో 7, చర్లపల్లిలో 6.1, ఉప్పల్‌లో 5.9, మల్కాజిగిరిలో 5.5 సెం.మీ. వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గార్ల వద్ద పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నడివాడలో గాలివాన బీభత్సం సృష్టించడంతో వంద ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. మరో 50 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.


వరి చేలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోదాడ-మిర్యాలగూడ రహదారిపై నీరు నిలిచింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దులోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఆదివారం 2.76 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు పది గేట్లను తెరిచి 2,75,700 క్యూసెక్కులను కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 65,626 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.


25న అల్పపీడనం

ఈ నెల 25 నాటికి తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిసా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో 27 నాటికి తీరం దాటుతుందని పేర్కొంది. మరోవైపు, సోమవారం రాష్ట్రంలోని నిర్మల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పిడుగుపాట్లకు ఇద్దరు మహిళల మృతి

ఆదిలాబాద్‌ జిల్లా బోరజ్‌ మండలం పెండల్‌వాడ గ్రామానికి చెంది న నిర్మల (33), సంతోష్‌ దంపతులు ఆదివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నిర్మల సెల్‌ఫోన్‌ మరిచిపోవడంతో పొలం వద్దకు వెళ్లింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఆమె సెల్‌ఫోన్‌ తీసుకుని చెట్టు కింద నిలబడింది. ఆ సమయంలో పిడుగుపడి ఆమె అక్కడికక్కడే మరణించింది. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గోలపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో వరి చేలో కలుపు తీస్తున్న శంకరమ్మ(30), నాగమ్మ(32) సమీపంలోని చెట్టు కిందికి వెళ్లి నిలబడ్డారు. పిడుగుపడటంతో శంకరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.

Updated Date - Sep 22 , 2025 | 05:17 AM