Heavy Rains Cause Flooding and Missing Persons: హైదరాబాద్‌లో కుండపోత
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:00 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కుండపోత వాన కురిసింది. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది...
నాలాలు ఉప్పొంగి ముగ్గురు గల్లంతు.. పలు ప్రాంతాలు అతలాకుతలం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కుండపోత వాన కురిసింది. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ముషీరాబాద్ బౌద్ధనగర్‌లో గంటన్నర సమయంలోనే రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వాన పడింది. జవహర్‌నగర్, మారేడ్‌పల్లి, షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసు్‌ఫగూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు వరద ప్రవహించింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కృష్ణానగర్ లో వరద ఉదృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, వరద నీటి ఉధృతి హైదరాబాద్‌లో నలుగురు గల్లంతయ్యారు. ఆసి్‌ఫనగర్ మంగార్ బస్తీలో నాలా ఉప్పొంగడంతో రాము, అర్జున్ అనే ఇద్దరు మామాఅల్లుళ్లు నీటిలో కొట్టుకుపోయారు. డీఆర్‌ఎఫ్ బృందాలు మూడు గంటల పాటు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ముషీరాబాద్ వినోబానగర్‌లో వరదలో దినేశ్ సన్నీ (24) అనే యువకుడు గల్లంతయ్యారు. హైడ్రా, డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు.

నిండుగా ప్రాజెక్టులు
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం భారీ వర్షా లు కురిశాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో ఏకంగా 24.3 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది. తూప్రాన్ పట్టణంలో వరదతో కేశవనగర్, సమీప ప్రాంతాలు నీట మునిగాయి. హల్ద్ధివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ గట్టి వాన కురిసింది. ములుగు జిల్లాలో శని, ఆదివారాలు విస్తారంగా వర్షాలు పడ్డాయి. జిల్లాలోని వెంకటాపురం మండలంలో అత్యధికంగా 13.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 4.68 సెం.మీ వాన కురవడం గమనార్హం. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వానలు కురిశాయి. పెన్‌గంగ ప్రమా ద స్థాయిలో ప్రవహిస్తుండటంవంతెనపై రాకపోకలు నిలిపివేశారు. బెజ్జూరు మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ జిల్లావ్యాప్తంగా సగటున 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల వాగులో ఏపీలోని పూచికపాడుకు చెందిన చెల్లమ్మ, వరలక్ష్మి గల్లంతైన విషయం తెలిసిందే. అధికారులు డ్రోన్లతో గాలింపు చేపట్టగా తెలంగాణలోని అనంతారం వాగువద్ద చెల్లమ్మ మృతదేహం లభ్యమైంది. వరలక్ష్మి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో జూరాలలో ఆరు గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లు ఎత్తారు. కృష్ణాతోపాటు తుంగభద్రపై ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో సింగూర్ గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు.