Share News

Heavy Rain: వణికిస్తున్న వర్షాలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:32 AM

బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.

Heavy Rain: వణికిస్తున్న వర్షాలు

  • హైదరాబాద్‌లో మరోసారి కుంభవృష్టి

  • వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

  • హయత్‌నగర్‌లోని బంజారాకాలనీలో పడవలో బాలింత తరలింపు

  • రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ వానలు

  • పిడుగుపాట్లతో ముగ్గురి మృతి

  • నేడూ కొనసాగనున్న వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం సాయంత్రం 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంజారాహిల్స్‌లో 10 సెం.మీ వర్షపాతం రికార్డు కాగా, దేవరకొండ బస్తీ నీట మునిగింది. వనస్థలిపురంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరద నీటితో కి.మీ మేరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యూసు్‌ఫగూడలో వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోగా, ద్విచక్ర వాహనంపై వరదలో చిక్కుకున్న మహిళను స్థానికులు కాపాడారు. పలు చోట్ల పార్కు చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు వరదలో మునిగిపోగా, కొట్టుకుపోతున్న వాహనాలను పట్టుకున్నారు. హయత్‌నగర్‌- బంజారా కాలనీలో రెండ్రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన ముడావత్‌ ప్రశాంతి ఇల్లు నీట మునిగింది. ఆమె కుటుంబ సభ్యులు సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తేవడంతో రెస్క్యూ టీం, డీఆర్‌ఎఫ్‌ బృంం పడవ సాయంతో ఆమెను ఒడ్డుకు చేర్చారు. బాట సింగారం చిన్నయేరుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు బైక్‌తోపాటు వరదలో కొట్టుకుపోయి రాళ్లను పట్టుకోవడంతో స్థానికులు జేసీబీ సాయంతో బయటికి తీశారు.


ఉప్పొంగిన ఈసీ.. మూసీ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌ మెట్‌ తదితర నగర శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈసీ, మూసీ నదులు ఉప్పొంగాయి. కొడంగల్‌ మండలం పర్సాపూర్‌ గ్రామ ర్యాలపేట చెరువుకు గండి పడింది. ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి మండలంలో 9.93 సెం.మీ వర్షపాతం రికార్డయింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామం, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామం, జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలో వేర్వేరుగా పడిన పిడుగులతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని విద్యుత్‌ డివిజనల్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయంపై పిడుగు పడటంతో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని డీఈ రామచంద్రయ్య తెలిపారు. ఆ సమయంలో కార్యాలయంలో ఆరుగురు సిబ్బంది ఉన్నా.. ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా గేట్లు ఓపెన్‌

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద మళ్లీ పెరిగింది. సోమవారం ఆల్మట్టికి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 90 వేల క్యూసెక్కుల నీరు, నారాయణపూర్‌ ప్రాజెక్టు వద్ద 90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1.04 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో.. ఉజ్జయినికి 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 72 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రికార్డైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సోమవారం 3.19 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రాగా, పది గేట్లను తెరిచి 3,12,260 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 65,365 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు 26 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3,32,152 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, అంతే మొత్తం దిగువకు వదిలేశారు. గోదావరి బేసిన్‌లోని సింగూరు ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే మొత్తం దిగువకు వదిలేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 61 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... 77 వేల క్యూసెక్కులు కిందకు వదిలారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన 2.54 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.99 లక్షల క్యూసెక్కులుండగా, అంతే మొత్తం దిగువకు వదిలేశారు.

Updated Date - Sep 23 , 2025 | 06:33 AM