Heavy Rain Floods: రాజధానిలో దంచి కొట్టిన వాన
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:53 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ఇబ్బందుల పాల్జేసింది. ఆదివారం సాయంత్రం సుమారు 20 నిమిషాల పాటు ఆగకుండా దంచికొట్టింది...
జలమయమైన రోడ్లు.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ఇబ్బందుల పాల్జేసింది. ఆదివారం సాయంత్రం సుమారు 20 నిమిషాల పాటు ఆగకుండా దంచికొట్టింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. సాయంత్రం భారీ వర్షం కురిసింది. మొంథా తుఫాను ప్రభావంతో గత నెల 28న రాత్రి నుంచి 29వ తేదీ రాత్రి వరకు తెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మరోసారి భారీ వర్షం అవస్థలు సృష్టించింది. ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, పంజాగుట్ట, చిక్కడపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, మియాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహించడంతోపాటు గుంతల్లో నీరు నిలిచిపోయింది. మాసబ్‌ట్యాంక్ బంజారాహిల్స్ మార్గంలో, జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్, హైటెక్‌సిటీ రోడ్డులో, మెహిదీపట్నం-అమీర్‌పేట్, ఉప్పల్-నాగోల్ మార్గాల్లో, మియాపూర్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేవలం ఇరవై నిమిషాల పాటు కురిసిన వర్షానికే అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నగరంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.