Heavy Rain: వరంగల్‌లో జోరువాన
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:48 AM
వరంగల్‌లో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది...
చెరువుల్ని తలపించిన రోడ్లు
అండర్ బ్రిడ్జి వద్ద వరదలో 2 బస్సులు
ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చిన సిబ్బంది
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): వరంగల్‌లో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు కాలనీలు జలమయం కాగా రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ముఖ్యంగా వరంగల్ నగరంతో పాటు ఖిలా వరంగల్ మండలాల పరిధిలో భారీ వర్షం పడగా.. మిగతా మండలాల్లో ఓ మోస్తరు వర్షపా తం నమోదైంది. బాలసముద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి నీరు చేరడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అండర్‌బ్రిడ్జి వద్ద చిక్కుకున్న బస్సులు
అండర్ రైల్వే బ్రిడ్జి కింద రెండు ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. హఠాత్తుగా బస్సు ఆగిపోవడంతో అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న నగర పాలక సంస్థ మాన్సూన్ బృందాలు, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక భారీ వర్షానికి హనుమకొండ చౌరస్తా జలమయమైంది. ప్రధాన రోడ్లతో పాటు సమీపంలోని పలు కాలనీలకు వరదనీరు పెద్దఎత్తున చేరింది. ఇటు,హనుమకొండ చౌరస్తాలో ప్రధానరోడ్డు వెం బడి మోకాళ్ల లోతు వరద పొంగి ప్రవహించడంతో రోడ్లన్ని చెరువుల్ని తలపించాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టులోకి 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మూడు గేట్ల ద్వారా 82,986 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 66,078 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 30 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతోంది. ఇక, జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.20లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఈ సీజన్‌లో ఆదివారం మూడోసారి తెరుచుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, 589.70 అడుగులకు చేరుకుంది.