Share News

Heavy rains: 27 వరకు భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:26 AM

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది...

Heavy rains: 27 వరకు భారీ వర్షాలు

  • నేడు, రేపు యెల్లో అలెర్ట్‌.. 26, 27న ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

  • నిజామాబాద్‌ జిల్లాలో గోడ కూలి తండ్రీకూతురు మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 26 నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం 27 నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రెండు రోజులకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 26, 27తేదీలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆ రెండు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక బుధవారం రాష్ట్రంలోని వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నాగార్జునసాగర్‌ 26 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 312 టీఎంసీల సామర్థ్యానికిగాను సాగర్‌లో 302.9 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి మొత్తం 3,42,506 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా అంతే మొత్తంలో ఇన్‌ ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మంగళవారం 3.98 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. పది గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,49,620 క్యూసెక్కులను, కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 65,482 క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.89 టీఎంసీల నీరు ఉంది. జూరాలకు 3.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 45 గేట్లను ఎత్తి 3.14 లక్షల క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,676 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రాజాపేట మండలంలో 10.5 సెం.మీ, సంస్థాన్‌నారాయణపురం మండలంలో 10.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


కుంటలో పడి ఒకరి గల్లంతు

మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట శివారులోని చింతలకుంటలో అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని అశోక్‌(35) గల్లంతయ్యాడు. కేబుల్‌ వైరు మరమ్మతు కోసం తెప్పపై కుంట లోపలికి వెళ్లిన అతడు.. పని చేస్తుండగా నీటిలో పడిపోయాడు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో ఇందూర్‌ మహే్‌ష(24)తో పాటు అతని నెలన్నర కూతురు గోడకూలి మృత్యువాత పడ్డారు. భార్య మహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఇంటిని ఆనుకొని మూతబడిన పాత రైస్‌మిల్‌ ఉంది. అది వాడుకలో లేకపోవడంతో భారీ వర్షాలకు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున రైస్‌మిల్‌ గోడ కూలి వీరి ఇంటిపై పడింది.

Updated Date - Sep 24 , 2025 | 08:13 AM