Heavy Inflows: శ్రీశైలానికి 6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:48 AM
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద కొనసాగుతోంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం 4.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది...
నాగార్జున సాగర్‌కు 5.6 లక్షల క్యూసెక్కుల వరద
భద్రాచలం వద్ద 50 అడుగుల ఎత్తులో గోదావరి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద కొనసాగుతోంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం 4.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 31 గేట్లను ఎత్తి 4.62 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 6.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పది గేట్లను 26 ఫీట్ల మేర ఎత్తి 5,76,940 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 64,211క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.2 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు 5,61,884 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 294.8 టీఎంసీలు నీరు ఉంది. కుడి కాల్వ ద్వారా 9,533 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6,401 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,251 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు, 26 గేట్ల నుంచి 5,31,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 5,81,919 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 50 అడుగులకు చేరింది. దీంతో కలెక్టర్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే మార్గంలో తూరుబాక డైవర్షన్ రోడ్డు వద్ద మంగళవారం సైతం రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 1.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
కౌకుంట్ల వాగులో ఒకరు గల్లంతు..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని కౌకుంట్ల - ఇస్త్రంపల్లి వాగులో మంగళవారం ఒకరు గల్లంతయ్యారు. ఇస్త్రంపల్లికి చెందిన అలివేలమ్మ, శాఖాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ కలిసి వాగు దాటుతుండగా వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వాగులోకి దూకి అలివేలమ్మను కాపాడారు. రమేశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
చివరి మజిలీకీ కష్టాలే..
వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో మనిషి చివరి మజిలీకి సైతం కష్టాలు తప్పడంలేదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడువీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంగళరావుపేటకు చెందిన వేల్పుల సమ్మయ్య(58) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో అంతిమ సంస్కారాల కోసం ఆయన మృతదేహాన్ని తరలించారు. అయితే శ్మశాన వాటికకు వెళ్లే దారి గోదావరి వరదతో మునిగిపోయింది. కి.మీ. మేర మోకాలి లోతు నీళ్లు, బురదతో నిండిపోయింది. మరో మార్గం లేకపోవడంతో గ్రామస్థులు ఆ వరద నుంచే నడిచి మృతదేహాన్ని తరలించారు.